పది రోజుల్లో ఇంటర్‌ పుస్తకాలు 

Telugu Academy Director Devasena Comments On Inter Text Books - Sakshi

పేపర్‌ కొరత వల్లే ఆలస్యం 

మూడు రోజుల్లో పేపర్, వెంటనే ముద్రణ 

తెలుగు అకాడమీ డైరెక్టర్‌ దేవసేన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జూనియర్‌ కాలేజీలకు మరో పది రోజుల్లో ఇంటర్‌ పాఠ్య పుస్తకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, తెలుగు అకాడమీ డైరెక్టర్‌ దేవసేన తెలిపారు. ‘సాక్షి’ప్రతినిధితో సోమవారం ఆమె మాట్లాడుతూ.. పేపర్‌ కొరత కారణంగానే ముద్రణ ఆలస్యమైందన్నారు. ‘‘ఈ పుస్తకాలకు నాణ్యమైన పేపర్‌ను ఉపయోగిస్తాం.

పేపర్‌ రేట్లు ఇటీవల విపరీతంగా పెరిగాయి. పాత కాంట్రాక్టు సంస్థల్లో ఒకటి మాత్రమే పేపర్‌ అందించడానికి ముందు కొచ్చింది. ప్రభుత్వం ఇటీవల వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంతో తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలకు డిమాండ్‌ పెరిగింది. దీంతో గతంలో వచ్చిన పేపర్‌ అవి ముద్రించడానికే ఉపయోగించాల్సి వచ్చింది. అవసరమైన పేపర్‌ను తెప్పించేందుకు అధికారులు సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రవాణాకు ఇబ్బంది ఏర్పడింది’’అని చెప్పారు. మార్కెట్లో ఖరీదుకు అందించే పుస్తకాలను ఇప్పటికే ముద్రించామని, ప్రభుత్వ కాలేజీలకు ఉచితంగా ఇవ్వాల్సిన పుస్తకాల్లో కొన్ని ముద్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పేపర్‌ అందిన మూడు రోజుల్లో ప్రింటింగ్‌ పూర్తి చేస్తామని తెలిపారు. తర్వాత వారం రోజుల్లో అన్ని కాలేజీలకు అందిస్తామన్నారు.  

పేపర్‌ కొరత సమస్య తెలంగాణకే కాదని, అన్ని రాష్ట్రాలకూ ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్‌ సంక్షోభం తర్వాత అంతర్జాతీయంగానూ పేపర్‌ ఖరీదు  పెరిగిందన్నారు. తాము టెండర్లు పిలిచినప్పటికి, ఇప్పటికి పేపర్‌ ఖరీదు రెట్టింపు అయిందని, అయినా నాణ్యత విషయంలో రాజీ పడకుండా విద్యార్థులకు మంచి పుస్తకాలు అందించాలనే సంకల్పంతో ఉన్నామని వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top