
సాక్షి, హైదరాబాద్: ‘నా బతుకంతా ఇక్కడే.. నేను, నా పిల్లలూ ఇక్కడే పుట్టాం. నేనిక్కడే చదువుకున్నా. ఇక్కడే ఉంటున్నా. తెలంగాణ ప్రజలకు సేవ చేస్తా. వారి పక్షాన పోరాడతా’అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చని ఆమె వ్యాఖ్యానించారు. అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో ఆమె శుక్రవారం పరామర్శించారు.
వారికి అండగా నిలబడతా నని భరోసా ఇచ్చా రు. షర్మిల మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు తాను వారి ప్రాంతాలకే వెళ్ళాలనుకున్నా కోవిడ్ నిబంధనలను అడ్డుపెట్టి యా త్రను ప్రభుత్వం అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడున్నరేళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ స్పందించలేదని విమర్శించారు. పాల్వంచ ఘటనలో నిందితుడిని శిక్షించాలన్నారు.