‘క్యూర్’బిల్లు–2026కు శ్రీకారం
పౌర కేంద్రీకృత సేవలు, సమగ్రపాలన, నెట్ జీరో లక్ష్యం
మెరుగైన ప్రజారోగ్యం, వ్యాపార అనుకూల విధానాలు
జూలై 24 వరకు ప్రజల నుంచి సూచనలకు ఆహ్వానం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలనలో కీలక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ చట్టం–1955 స్థానంలో ‘ది కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ను తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రజల ముందుంచి, జూలై 24 వరకు ప్రజాభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నట్టు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివద్ధి (ఎంఏయూడీ) శాఖ ప్రకటించింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (హెచ్‌ఎంసీ) చట్టం 1955లో రూపొందించబడిందని, గత 70 ఏళ్లలో హైదరాబాద్ మహానగరం విస్తారంగా అభివృద్ధి చెందడంతో ఆ చట్టంలోని అనేక నిబంధనలు ప్రస్తుత కాలానికి, వేగంగా విస్తరిస్తున్న మహానగర అవసరాలకు సరిపోవడం లేదని ప్రభుత్వం పేర్కొంది. అందుకే కొత్త బిల్లును రూపొందించినట్టు వెల్లడించింది. కొత్త బిల్లులో ప్రధాన అంశాలు ఇలా....
సమగ్ర పాలన–సమన్వయ యంత్రాంగం
ప్రస్తుతం హైదరాబాద్‌లో వివిధ సేవల కోసం వేర్వేరు ప్రభుత్వ శాఖలు (ఉదాహరణకు: జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ, పోలీస్, మెట్రో రైల్, హెచ్‌ఎండీఏ) విడివిడిగా పనిచేస్తున్నాయి. దీనివల్ల ఒక శాఖ రోడ్డు వేస్తే, మరో శాఖ పైప్‌లైన్ కోసం తవ్వడం లాంటి సమన్వయ లోపాలు కనిపిస్తుంటాయి. కొత్త బిల్లు ద్వారా ‘హోల్‌ఆఫ్ గవర్నమెంట్’విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రకారం కోర్ అర్బన్ రీజియన్‌న్‌లోని అన్ని ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలు ఒకే గొడుగు కిందకు వస్తాయి. దీనివల్ల ప్రభుత్వ నిధులు వృథా కావు, పనుల్లో జాప్యం తగ్గుతుంది.
పౌరుల సులభతర జీవనం
నగర పౌరులు చిన్నచిన్న పనుల కోసం (భవన నిర్మాణ అనుమతులు, జనన/మరణ ధ్రువీకరణ పత్రాలు, వివిధ రకాల ఫిర్యాదులు) ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులను తొలగించడం. పౌర సేవలన్నింటినీ ’సిటిజన్–సెంట్రిక్’(ప్రజల కేంద్రంగా) మార్చడం. తద్వారా ఆధునిక సాంకేతికత, డిజిటలైజేషన్ సహాయంతో సేవల లభ్యతను మరింత సరళీకరిస్తారు. పౌరులకు సేవలు వేగంగా, పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా నేరుగా అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
పర్యావరణ స్థిరత్వం–నెట్ జీరో విజన్
వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ వల్ల కాలుష్యం, ఉష్ణోగ్రతలు పెరగడం, వరదల వల్ల పర్యావరణ సవాళ్లు ఎదురవుతున్నాయి. భవిష్యత్ తరాలకు సురక్షితమైన నగరాన్ని అందించేందుకు గ్రీన్ ఎనర్జీ వినియోగం పెంచడం, వ్యర్థాల సమర్థవంతమైన నిర్వహణ, పచ్చదనాన్ని పెంపొందించడం, కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా పర్యావరణ హితమైన పట్టణ వ్యవస్థలను నిర్మిస్తారు.
మెరుగైన ప్రజారోగ్య వ్యవస్థలు
ఒక మహానగరం ఎంత అభివృద్ధి చెందినా, అక్కడి ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉన్నప్పుడే ఆ అభివృద్ధికి సార్థకత ఉంటుంది. అంటువ్యాధుల నివారణ, పారిశుధ్యం ఇందులో భాగం. నూతన విధానంలో భాగంగా ఒకే రకమైన అత్యంత బలీయమైన ప్రజారోగ్య వ్యవస్థలను ఏర్పాటు చేయడం. ఇందుకు పారిశుధ్య నిర్వహణను ఆధునీకరించడం, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, కల్తీ నియంత్రణ, తక్షణ ఆరోగ్య సేవల బలోపేతం.
సులభతర వాణిజ్యం–వ్యాపార అనుకూలత
హైదరాబాద్ అంతర్జాతీయంగా పెట్టుబడులకు, వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇందుకుగాను పట్టణ పరిపాలన, అనుమతుల ప్రక్రియలో జాతీయ, అంతర్జాతీయ అత్యుత్తమ విధానాలను అవలంబించడం. తద్వారా వ్యాపారాలు, స్టార్టప్‌లు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన మున్సిపల్ అనుమతులను సింగిల్ విండో విధానంలో వేగంగా ఇవ్వడం. దీనివల్ల నగరానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయి, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. బిల్లులోని ముఖ్యమైన ఈ అంశాల ద్వారా హైదరాబాద్‌లోని కోర్ అర్బన్ ప్రాంతాలను కేవలం కాంక్రీట్ జంగిల్‌లా కాకుండా, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన ’లివబుల్ గ్లోబల్‌సిటీ’గా మార్చడానికి బలమైన పునాది పడుతుందని అధికారులు అంటున్నారు.
ప్రజల సూచనలకు ప్రభుత్వం ఆహ్వానం
చట్టాల రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ బిల్లును ప్రజా సంప్రదింపుల కోసం అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం తెలిపింది. పౌరులు తమ అభిప్రాయాలు, సూచనలను ఆన్‌లైన్ ద్వారా ( https://ghmc.gov.in/categoryWise InsertReport.aspx ) సమర్పించొచ్చని పేర్కొంది. మూడు కార్పొరేషన్ల వెబ్‌సైట్లలో ముసాయిదా బిల్లును అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. రాతపూర్వకంగా కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ, సచివాలయం, హైదరాబాద్‌కు తమ సూచనలను పంపొచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించే ప్రక్రియ జూలై 24, 2026 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది.


