Telangana: గుడి గోల్డ్‌.. బాండ్స్‌లోకి..

Telangana Temples Deposit 800kg Unused Gold With Sbi  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాల్లో 800 కిలోల బంగారు నిల్వలు, దాదాపు 3,750 కిలోల వెండి నిల్వలు ఉన్నట్లు అధికారులు లెక్కగట్టారు. ఇందులో నిత్య కైంకర్యాలు, ప్రత్యేక రోజుల్లో దేవుళ్ల అలంకరణకు అవసరమైన బంగారు, వెండి ఆభరణాలు మినహా కానుకల రూపంలో భక్తులు స్వల్ప మొత్తాల్లో సమర్పించే బంగారం, వెండిని వాడటం లేదు. కానీ వాటిని ఆలయాల్లోనే భద్రపరచడం క్షేమం కాదని భావించి బ్యాంకు లాకర్లలో ప్రభుత్వం భద్రపరుస్తోంది.

ఇందుకు దేవాదాయ శాఖ లాకర్‌ చార్జీలు చెల్లిస్తోంది. కొన్నింటికి బీమా చేయించినందున.. బీమా ప్రీమియం సైతం కడుతోంది. వెరసి వినియోగంలో లేని ఆభరణాలు, బంగారు, వెండి ముక్కల వల్ల ఎలాంటి ఆదాయం లేకపోగా ఖర్చే మిగులుతోంది. దీంతో ఆయా ఆలయాల్లో వినియోగించని నగలు, బంగారు, వెండిని (కిలోకన్నా ఎక్కువగా ఉంటేనే) గోల్డ్‌ బాండ్‌ పథకంలో డిపాజిట్‌ చేయాలని ఇటీవల నిర్ణయించిన దేవదాయ శాఖ... ఆ మేరకు ఆలయాలవారీగా ప్రక్రియ ప్రారంభించింది.

ఇందుకోసం బంగారాన్ని కరిగించి 95 శాతం స్వచ్ఛత స్థాయికి తెచ్చి ఆ రోజు బంగారు ధర ప్రకారం స్టేట్‌ బ్యాంకు ఆధ్వర్యంలోని గోల్డ్‌ డిపాజిట్‌ పథకంలో చేరుస్తోంది. దాని విలువ మేరకు ఐదేళ్ల కాలపరిమితితో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తోంది. ఈ మొత్తంపై బ్యాంకు 2.25 శాతం వడ్డీని ఆయా ఆలయాలకు చెల్లించనుంది. బంగారం, వెండి కరిగింపు చార్జీలను సైతం బ్యాంకే భరిస్తోంది. ఐదేళ్ల తర్వాత ఎఫ్‌డీని కొనసాగించొచ్చు. కాదంటే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకొని దేవాలయాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. ఇప్పటికే బాసర, వేములవాడ, సికింద్రాబాద్‌ గణేశ్‌ మందిరం, ఉజ్జయినీ మహంకాళి, కొండగట్టు, కొమురవెల్లి ఆలయాలకు చెందిన బంగారం డిపాజిట్‌ చేసే ప్రక్రియ మొదలైంది. ఇక వెండిని కూడా కరిగించి దాన్ని మేలిమి బంగారం విలువతో లెక్కించి ఆ మేరకు నగదులోకి మార్చి బ్యాంకు డిపాజిట్‌ చేయించుకుంటోంది.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top