వ్యయాన్ని తగ్గించండి

Telangana: State Government Request To AAI On The Six Airport Project - Sakshi

ఆరు విమానాశ్రయాల ప్రాజెక్టుపై ఏఏఐకి రాష్ట్ర సర్కార్‌ వినతి 

వర్చువల్‌ పద్ధతిలో ఉన్నతస్థాయి భేటీలో సూచన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ప్రతిపాదించిన ఆరు విమానాశ్రయాలపై ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా రూపొందించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని తగ్గించాలని రాష్ట్రప్రభుత్వం కోరింది. ఆ విమానాశ్రయాల ఏర్పాటుకు అడ్డుగా ఉన్న కొన్ని నిర్మాణాలను తొలగించాల్సిందేనంటూ ఇటీవల టెక్నో ఎకనమిక్‌ ఫీజుబిలిటీ స్టడీ నివేదికలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సూచించింది. ఇందులో అంచనా వ్యయాన్ని కూడా పేర్కొంది. అయితే నిర్మాణాల తొలగింపు ఖర్చు రాష్ట్రప్రభుత్వానికి భారంగా మారింది.

ఒక్కో విమానాశ్రయానికి సగటున రూ.600 కోట్ల చొప్పున ఖర్చు చేయా ల్సి వస్తోంది. ఈ ఖర్చును తగ్గించేందుకు కొన్ని మార్పులు చేయాలని రాష్ట్రప్రభుత్వం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులను కోరింది. మంగళవారం వర్చువల్‌ పద్ధతిలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలో అధికారులు మెట్రోభవన్‌ నుంచి ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఈడీతో భేటీ అయ్యారు. ఖర్చును తగ్గింపునకు కొన్ని సూచనలు చేశారు.  

వరంగల్‌ సహా మరో రెండు విమానాశ్రయా లకు కాస్త దూరంగా గుట్టలున్నాయి. సాంకేతిక ఇబ్బందులు రాకుండా వీటిని కొంతమేర తొలగించాలని గతంలో ఏఏఐ పేర్కొంది. ఈ పనిని మినహాయించాలి. అందుకు ప్రత్యామ్నాయం చూపాలి. 
రెండు విమానాశ్రయాలకు థర్మల్‌ విద్యుత్తు కేంద్రం కూలింగ్‌ టవర్లు(చిమ్నీలు) అడ్డుగా ఉన్నందున తొలగించాలని సూచించారు. ఇది భారీ ఖర్చుతో కూడుకున్నది. దీన్ని కూడా మినహాయించాలి. అవి దాటిన తర్వాతనే భూసేకరణకు అనుమతినివ్వాలి.  
బసంత్‌నగర్‌ విమానాశ్రయానికి చేరువగా ఉన్న సిమెంటు ఫ్యాక్టరీ చిమ్నీని తొలగించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయం చూపాలి.  
రెండుచోట్ల కొన్ని పరిశ్రమలను తొలగించాలన్న అంశాన్ని కూడా పునఃపరిశీలించాలి. అం తమందికి ఉపాధి కల్పించటం ప్రభుత్వానికి పెద్ద భారంగా ఉంటుంది.  
రెండు విమానాశ్రయాలకు చేరువగా ఉన్న ప్రార్థన మందిరాలను తొలగించాలన్న సూచనను కూడా ఉపసంహరించుకోవాలి. ఆయా ప్రాంతాల్లో తక్కువ భూమిని విమానాశ్రయాలకు కేటాయించేలా చూడాలి. 
 కాగా, ఈ అంశాలపై పరిశీలించి తగు సూచనలు అందించేందుకు మరో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో ఏయే విమానాశ్రయాలను ముందు చేపట్టనున్నారో కూడా స్పష్టత రానుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top