
నేడు రాష్ట్ర కేబినెట్ విస్తరణ.. మధ్యాహ్నం 12:15 గంటలకు ముహూర్తం
వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్‌కు మంత్రి పదవులు ఖరారు
అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లిలో ఒకరికి అవకాశం.. అడ్లూరివైపే అధిష్టానం మొగ్గు
రెడ్లకు చాన్స్ ఇస్తే సుదర్శన్‌రెడ్డికే పదవి.. విస్తరణపై శనివారమంతా ఉత్కంఠ
ముఖ్యమంత్రిని కలిసిన మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు.. అందుబాటులో ఉండాలని సూచించిన రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులకు గాను మూడు లేదా నాలుగు బెర్తులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త మంత్రులు ఆదివారం మధ్యాహ్నం 12:15 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కొత్త మంత్రులుగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), గడ్డం వివేక్ (చెన్నూరు) పేర్లు ఖరారయ్యాయి.
మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లేదా కవ్వంపల్లి సత్యనారాయణకు అవకాశం లభించవచ్చని సమాచారం. అడ్లూరివైపే పార్టీ పెద్దలు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. రెడ్డి సామాజికవర్గానికి ఈసారి విస్తరణలో అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. ఒకవేళ లభిస్తే మాత్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత పి.సుదర్శన్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయి. కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు.
రోజంతా ఉత్కంఠ
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం శనివారం రోజంతా చర్చనీయాంశమైంది. ఆదివారం ఉదయమే విస్తరణ ఉంటుందని, కాదుకాదు మధ్యాహ్నం అంటూ విస్తృతంగా ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, విస్తరణపై ఏఐసీసీ కానీ, టీపీసీసీ కానీ శనివారం అర్ధరాత్రి వరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ శనివారం ఢిల్లీలోనే ఉన్నారు. అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్‌కు చేరుకుంటారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
ఆదివారం ఉదయం శిల్పకళావేదికలో జరిగే హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మక«థ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ కార్యక్రమం మినహా మరో కార్యక్రమం గవర్నర్ షెడ్యూల్‌లో లేదని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి కూడా హాజరు కానున్నారు. దీంతో ఈ కార్యక్రమం అనంతరం రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం తర్వాత కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందనే ప్రచారం జరిగింది.
కానీ, సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)కి కానీ, రాజ్‌భవన్‌కు కానీ ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్ల కోసం ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో అసలు విస్తరణ ఉంటుందా? ఉండదా? ఉంటే ఎన్ని బెర్తులు భర్తీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ వీడలేదు. శనివారం అర్ధరాత్రి ఈ అంశంపై స్పష్టత వచ్చింది. మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు చేయాలని జీఏడీ నుంచి గవర్నర్ కార్యాలయానికి సమాచారం అందించారు. దీంతో నేటి మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
అందుబాటులో ఉండండి
కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు రేగిన నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేలు, కాలె యాదయ్య, వేముల వీరేశంలు సీఎం రేవంత్‌ను కలిసి తమ సామాజిక వర్గానికి కేబినెట్‌లో స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇందుకు స్పందించిన రేవంత్.. కేబినెట్ విస్తరణ ఎప్పుడైనా జరగొచ్చని, ఆదివారం ఐదుగురు హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండాలని సూచించారు. మరోవైపు అధిష్టానానికి తాను ప్రతిపాదనలు మాత్రమే పంపగలనని, తుది నిర్ణయం ఢిల్లీ పెద్దలదేనని ఆ ఎమ్మెల్యేలతో సీఎం చెప్పినట్టు సమాచారం.