
సాక్షి, హైదరాబాద్: ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంలో ఇవాళ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. తనకు మూడు నెలల గడువు విధించడంపై న్యాయ నిపుణులతో చర్చించాకే తదుపరి నిర్ణయానికి వెళ్తామని అన్నారాయన. ఈ క్రమంలో ధన్‌ఖడ్ వ్యాఖ్యల ప్రస్తావన తెచ్చారు.
‘‘సుప్రీంకోర్టు తీర్పు పై న్యాయ నిపుణులతో చర్చిస్తా. మాజీ ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ ఏం మాట్లాడారో అందరూ చూశారు. వాటిని కూడా మేము పరిశీలిస్తున్నాం. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. సుప్రీం కోర్టు తీర్పును పరిశీలించాకే అన్ని వివరాలు త్వరలో చెప్తా’’ అని అన్నారాయన.
ఇదిలా ఉంటే.. పార్టీ మారిన పది మందిపై తొలుత తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో.. విచారణ షెడ్యూల్ కోసం సింగిల్ బెంచ్ జడ్జి తెలంగాణ స్పీకర్‌కు నాలుగు వారాల గడువు విధించారు. అయితే డివిజనల్ బెంజ్ దానిని కొట్టేసింది. ఇక ఇవాళ్టి తీర్పులో ఫిరాయింపులపై చర్యల విషయంలో స్పీకర్‌కు సుప్రీం కోర్టు మూడు నెలల కాలపరిమితి విధించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రపతి, గవర్నర్‌లకు గడువు విధిస్తూ సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉప రాష్ట్రపతి హోదాలో ఓ కార్యక్రమానికి హాజరైన ధన్‌ఖడ్.. సుప్రీం కోర్టుపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పార్లమెంటే సుప్రీం అని. ఎన్నికైన ప్రజాప్రతినిధులే రాజ్యాంగ ప్రకారం అల్టిమేట్ మాస్టర్స్ అని అన్నారాయన. ‘‘సుప్రీం కోర్టు రాష్ట్రపతికి గడువు విధించడం తగదు. ఇప్పుడు జడ్జీలు శాసనాలు చేస్తారు, కార్యనిర్వాహక విధులు నిర్వర్తిస్తారు, సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు’’ అని విమర్శించారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్య శక్తులపై అణుక్షిపణి ప్రయోగించకూడదు అని తీవ్ర వ్యాఖ్య చేశారాయన. అయితే..
పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలన్న పిటిషన్ విచారణ సమయంలో సుప్రీం కోర్టు పరోక్షంగా ధన్‌ఖడ్ వ్యాఖ్యలపై స్పందించింది. ఇప్పుడు మేమే కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేస్తున్నామన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా? అంటూ ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
సంబంధిత వార్త: ఆలస్యం చేసే ఎత్తుగడలు సరికావు.. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్