కొనుగోలు ప్రాంతంలోనే  గొర్రెల బీమా

Telangana: Sheep Insurance Claim Within 10 Days Of The Lamb Died - Sakshi

గొర్రె చనిపోతే 10 రోజుల్లోగా బీమా క్లెయిమ్‌

పశుసంవర్థక శాఖ సమీక్షలో మంత్రి తలసాని

సాక్షి, హైదరాబాద్‌: రెండో విడతలో పంపిణీ చేసే గొర్రెలకు కొనుగోలు ప్రాంతంలోనే బీమా చేయించి సంబంధిత పత్రాలు లబ్ధిదారులకు అందజేయాలని పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులకు సూచించారు. ఒకవేళ గొర్రె చనిపోతే 10 రోజుల్లోగా బీమా క్లెయిమ్‌ చేసి లబ్ధిదారుడికి అందించేలా పథకాన్ని అమలు చేయాలన్నారు. శనివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో పశుసంవర్థక శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు, రెండో విడత గొర్రెల పంపిణీపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాష్ట్ర పశుసంవర్థక శాఖ పనితీరును కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిందన్నారు. పెరిగిన జీవాలకనుగుణంగా గ్రాసం కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

జీవాల వద్దకు వైద్య సేవలు తీసుకెళ్లేలా సంచార పశు వైద్యశాలల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పెంపకందారులు గొర్రెలు అమ్మి, కొనుక్కునేందుకు త్వరలోనే ఖమ్మం, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల్లో గొర్రెల మార్కెట్‌ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈనెల 6 నుంచి 13 వరకు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని గజ్వేల్‌ నుంచి ప్రారంభిస్తామని తలసాని వెల్లడించారు. జీవాలకు వైద్య సేవలు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాల కోసం గోపాలమిత్రల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ రాంచందర్, పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, టీఎస్‌ఎల్‌డీఏ సీఈవో మంజువాణి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top