రోడెక్కిన సిటీ బస్సులు 

Telangana RTC Buses To Back On Hyderabad Roads From Friday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరునెలల తర్వాత హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి సిటీ బస్సులు రోడెక్కాయి. మొత్తం బస్సుల్లో  25 శాతమే తిప్పనున్నారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయి సిటీ బస్సుల రవాణా గురించి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో పావు వంతు బస్సులు తిప్పటమే ఉత్తమమంటూ ఆర్టీసీ ఎండీ  ఇచ్చిన నివేదిక మేరకే సీఎం అనుమతి ఇచ్చారు. శుక్రవారం ఉదయం షిఫ్ట్‌ నుంచి  బస్సులు తిరుగుతున్నాయి. వారం, పది రోజుల తర్వాత పరిస్థితి సానుకూలంగా కనిపిస్తే, 50 శాతం బస్సులను అనుమతించనున్నట్టు సమాచారం. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా అంతర్రాష్ట్ర  బస్సులను పునరుద్ధరించేందుకు సీఎం అనుమతించారు. ఈ సర్వీసులు కూడా శుక్రవారం నుంచే ప్రారంభమవుతాయి. ముఖ్యమైన ఆంధ్ర–తెలంగాణ అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో కదలిక రాలేదు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే జిల్లా సర్వీసులు తిరుగుతుండగా, బుధవారం హైదరాబాద్‌ శివారు గ్రామాలకు మఫిసిల్‌ సర్వీసులు మొదలయ్యాయి.  

ప్రధాన రూట్లలో ఎక్కువ.. 
ప్రభుత్వ నిర్ణయం మేరకు హైదరాబాద్‌ నగరంలో తొలుత దాదాపు 625 బస్సులు తిప్పుతున్నారు. అయితే ఇందులో రద్దీ ఎక్కువగా ఉండే ముఖ్యమైన రూట్లలోనే ఎక్కువ సర్వీసులు తిప్పనున్నారు. కీలకమైన ఎయిర్‌పోర్టు రూట్‌తోపాటు పటాన్‌చెరు–చార్మినార్, పటాన్‌చెరు–హయత్‌నగర్, ఉప్పల్‌–లింగంపల్లి, గచ్చిబౌలి–దిల్‌సుఖ్‌నగర్‌తోపాటు చార్మినార్, జూపార్కు, ఎల్‌బీనగర్, చింతల్, బీహెచ్‌ఈఎల్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాలకు ఎక్కువ సర్వీసులు ఉంటాయని తెలుస్తోంది. ఇందులోనూ ఎక్స్‌ప్రెస్‌ బస్సులే ఎక్కువగా తిరిగే అవకాశం ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top