
అనంతగిరి ఘాట్‌లో బోల్తాపడిన బస్సు
అనంతగిరి: వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు, మరో 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ధారూరు క్రిస్టియన్ జాతర నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎన్‌టీఆర్ చౌరస్తాలో బస్సు ఎక్కారు. 70 మంది ప్రయాణికులతో బస్సు బయలు దేరింది.
అనంతగిరి ఘాట్ రోడ్డు దిగుతున్న క్రమంలో బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో చివరి ఘాట్ వద్ద ముందు వస్తున్న వాహనాలను తప్పించబోయి కుడి వైపు ఉన్న రోడ్డు కిందికి దూసుకుపోయి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో సికింద్రాబాద్ రసూల్‌పురాకు చెందిన స్వరూప (36) అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, బస్సు బ్రేక్ ఫెయిల్ అయిన విషయాన్ని డ్రైవర్ ప్రయాణికులకు చెప్పడంతో భయాందోళనకు గురైన పలువురు బస్సులోంచి దూకేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి. మరికొందరు బస్సులోనే ఉండిపోయారు.
మానవత్వం చాటుకున్న ఎంపీ, ఎమ్మెల్యే
ప్రమాదం జరిగిన సమయంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ క్రిస్టియన్ జాతరకువెళ్తున్నారు. విషయం తెలిసిన వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. గాయపడ్డ వారిని అంబులెన్స్‌లు, ప్రైవేటు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు.