పర్యావరణాన్ని పణంగా పెట్టకుండా అభివృద్ధి 

Telangana Remains Frontrunner In Supporting Start Ups: KTR - Sakshi

ఆ దిశగా దృష్టి పెట్టాలి

ఇంక్‌ వాష్‌ సదస్సులో మంత్రి కేటీఆర్‌ సూచన 

వచ్చే 50 ఏళ్లలో అత్యంత వేగంగా పట్టణీకరణ 

దేశాన్ని ముందుకు నడుపుతోంది నగరాలు, పట్టణాలే..

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే 50 ఏళ్లలో మానవాళి చరిత్రలోనే ముందెన్నడూ లేనంత అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. దీనిద్వారా పర్యావరణంపై పడే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవడంపై, పరిష్కార మార్గాలపై ప్రభుత్వాలు ఇ ప్పటినుంచే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. రెండు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఇన్నోవేషన్స్‌ అండ్‌ న్యూ నాలెడ్జ్‌ ఇన్‌ వాటర్, శానిటేషన్, హైజీన్‌పై మూడో వార్షిక సదస్సు (ఇంక్‌ వాష్‌ 3.0) శుక్రవారం ముగిసింది. కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. 

మెరుగైన అవకాశాల కోసం వలసలు 
‘జాతిపిత గాంధీ చెప్పినట్లు గ్రామాల్లోనే భారతదేశం ఉంది. కానీ భారత్‌ను ఆర్థికంగా ముందుకు నడుపుతోంది నగరాలు, పట్టణాలు మాత్రమే. తెలంగాణను ఉదాహరణగా తీసుకుంటే 46 శాతం జనాభా పట్టణాల్లో, 54 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. నాలుగో వంతు జనాభా హైదరాబాద్‌లోనే ఉండగా, జీఎస్‌డీపీలో 45 నుంచి 50 శాతం వాటా ఇక్కడి నుంచే వస్తోంది.

కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా నగరాలే ఆయా దేశాలకు అభివృద్ధి ఇంజిన్లుగా పనిచేస్తున్నాయి. మెరుగైన ఉపాధి, ఆర్థిక, విద్య, ఆరోగ్య అవకాశా లు, నాణ్యమైన జీవితం కోసం పట్టణాలకు వలస లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. పట్టణీకరణతో పెరిగే పర్యావరణ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణాన్ని çపణంగా పెట్టకుండా అభివృద్ధి సాధించాలి..’అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.  

‘వాష్‌’తో ఎంతోమందికి ఉపాధి 
‘మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విప్లవం దేశంలో లక్షలాది మందికి ఉపా ధి అవకాశాలు కల్పించిన రీతిలోనే భవిష్యత్తులో నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత (వాష్‌) రంగాల్లో అనేక మందికి ఉపాధి లభిస్తుంది. ఈ రంగాల్లో యువ ఆవిష్కర్తలు చేసే కృషితో ఉపాధి అవకాశా లు, సంపద సృష్టికి మార్గం దొరుకుతుంది. మానవ మలం నుంచి ఎరువుల తయారీ మొదలుకుని, మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం వరకు ఆవిష్క ర్తలు కనిపెట్టే కొత్త ఉత్పత్తులకు తెలంగాణ ప్రభుత్వం మొదటి వినియోగదారుగా ఉంటుంది..’అని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

పరిశుభ్రత, పారిశుధ్యంపై పిల్లలకు ఇప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలని, ఇది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ అఫ్‌ ఇండియా, రాష్ట్ర పురపాలక శాఖ భాగస్వామ్యంతో జరిగిన ఈ ‘ఇంక్‌ వాష్‌ 3.0’సదస్సులో నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత రంగాల్లో పనిచేస్తున్న ఆవిష్కర్తలతో పాటు విద్యా సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా 120కి పైగా ఆవిష్కరణలతో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ముగింపు సదస్సులో ఆస్కి చైర్మన్‌ కె.పద్మనాభయ్య, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు, రాష్ట్ర, రాష్ట్రేతర నగరపాలక సంస్థల మేయర్లు తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top