
సాక్షి, హైదరాబాద్: నేడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి. ఈ సందర్భంగా మహానేత వైఎస్సార్‌కు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, పలువురు నేతలు ఘన నివాళి అర్పిస్తున్నారు. ప్రజలకు వైఎస్సార్ అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ..‘జనహృదయ నేతకు నివాళి. రాష్ట్రాన్ని సంక్షేమ యుగానికి తీసుకెళ్లిన మహానేత, అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన నాయకుడు, రైతు బంధువుగా, ప్రజల ఆశయ నాయకుడిగా చిరస్మరణీయుడైన డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళి. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ అందించిన సేవలు ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతాయి. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ, వారి అడుగుజాడల్లో ప్రజాపాలన సాగిస్తున్నాం’ అని అన్నారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ..‘అవిశ్రాంత ప్రజా సేవకులు. వైఎస్సార్ ప్రజా పాలనకు నిలువెత్తు నిదర్శనం. మహానేత, అభివృద్ధి ప్రదాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు’ అర్పించారు.
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ..‘జన హృదయనేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వారికి నా హృదయపూర్వక నివాళి. పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని.. ప్రజాసంక్షేమమే విధానంగా ప్రభుత్వం నడవాలని.. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, చిర స్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు వైఎస్సార్’ అని అన్నారు.