మీ ఇంట్లో పాత టీవీలు, రేడియోలు ఉన్నాయా? 

Telangana Police Suggests Do Not Trust Fake News About Red Valve - Sakshi

వాటిలోని ఎర్రని వాల్వ్‌కు రూ.కోటి ఇస్తామంటూ ఎర 

మెటల్స్‌ని గుర్తించే వాల్వ్‌ బంగారాన్ని వెలికి తీస్తుందంటూ ప్రచారం.. 

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్టులు  

నమ్మవద్దని హెచ్చరిస్తున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: గుప్తనిధులు, లంకెబిందెలు, రైస్‌పుల్లింగ్‌.. రెండు తలల పాము అంటూ ప్రజలను మోసగించే ముఠాలు కొత్త దారుల్లో జనాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. తాజాగా పాత టీవీలు, రేడియోల్లోని వాల్వ్‌ల వెతుకులాటకు పరుగులు పెట్టేలా కొందరు సోషల్‌ మీడియాలో పోస్టులను వైరల్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘మీ ఇంట్లో పాత టీవీ, రేడియో ఉన్నాయా? అందులోని ఈ ఎర్రని వాల్వ్‌ తీసుకొస్తే మీకు రూ.కోటి ఇస్తాం..’అంటూ వాట్సాప్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 25–30 ఏళ్లనాటి టీవీలు, రేడియోల్లోనే ఇది ఉంటుందని, ఆ వాల్వ్‌ తెచ్చిన వారికి రూ.లక్షలు, కోట్లలో నజరానా ఇస్తామంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది.

ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట జిల్లాల్లో దీని గురించి సామాన్యులు బాగా చర్చించుకుంటున్నారు. ఈ ప్రచారం మొదలైనప్పటి నుంచి టీవీ మెకానిక్‌ షాపుల వారికి వీటికోసం వెతికే వారి తాకిడి పెరిగింది. పాత టీవీలు ఉన్నా యా? ఎంత రేటైనా సరే.. పెట్టి కొంటామం టూ చాలామంది వస్తున్నారు. దీంతో కొందరు టీవీ మెకానిక్‌లు సైతం వీటి ఆన్వేషణలో పడ్డారు. చాలా మంది అటకెక్కించిన టీవీలను కిందికి దించి చూస్తున్నారు. 

నిధులను గుర్తిస్తుందంటూ.. 
టీవీ, రేడియోల్లోని బోర్డుల్లో ఒకప్పుడు ఉపయోగించే ఎర్రటి వాల్వ్‌కు లోహాలను గుర్తించే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. సరిగ్గా ఈ అంశాన్నే మోసగాళ్ల ముఠా సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. ఈ వాల్వ్‌ భూమిలో పూర్వీకులు దాచిన గుప్తనిధులు, బంగారాన్ని గుర్తిస్తుందని, ఇది ఉంటే శ్రీమంతులు కావొచ్చని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురు ఒకరితో మరొకరు గొలుసుకట్టులా వాల్వ్‌లు సేకరించే పనిలో పడ్డారే తప్ప.. ఎవరు డబ్బులు ఇస్తారు? ఎంత ఇస్తారు? ఎలా ఇస్తారు? అన్న విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. కొందరు అప్పులు చేసి మరీ అడిగినకాడికి చెల్లించి ఇలాంటి వాల్వ్‌లను సొంతం చేసుకుంటున్నా రు. తర్వాత వాటిని ఎలా విక్రయించాలి.. ఎవరికి విక్రయించాలి అన్న విషయం తెలియక తలలు పట్టుకుంటున్నారు. 

ప్రచారాలు నమ్మవద్దు.. 
ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని, దీని వెనక భారీ మోసం దాగి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా రైస్‌పుల్లింగ్‌ తరహా మోసమని స్పష్టం చేస్తున్నారు. వీటిని చూపి ఎవరు గుప్త నిధులు తవ్విస్తామని చెప్పినా నమ్మవద్దని సూచిస్తున్నారు. ఇలాంటివి ప్రచారం చేసే ముఠాలు నిధుల తవ్వకం పేరిట డబ్బులు దోచుకుంటాయని హెచ్చరిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top