హోంగార్డుల వేతన వెతలు

Telangana Police Department Home Guards Concern Over Salary - Sakshi

జిల్లాల్లో జీతాలు రాక కుటుంబాల ఆందోళన 

రోజువారీ ఖర్చులకు అప్పులు చేయాల్సిన దుస్థితి 

గత నెలలో కారణం లేకుండానే రూ.10 వేలు కోత 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నెలలో పదిహేను రోజులు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకు జీతాలు అందకపోవడం ఆ కుటుంబాలు తీవ్ర ఒత్తిడిలోకి లోనవుతున్నాయి. రోజువారీ ఖర్చులకు సైతం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల స్కూళ్లు ప్రారంభంకావడంతో పుస్తకాలు, యూనిఫామ్‌ల ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌ మినహా మిగిలిన అన్ని యూనిట్లు, జిల్లాల్లో హోంగార్డులదీ ఇదే పరిస్థితి.  

ఇక్కడ ఇలా.. అక్కడ అలా.. 
రాష్ట్రవ్యాప్తంగా 16460 మంది హోంగార్డులు పోలీస్‌ శాఖలో పని చేస్తున్నారు. ప్రభుత్వం వీరికి కొద్ది రోజుల క్రితమే వేతనాలు పెంచింది. ప్రతి నెలా రూ.26వేల చొప్పున చెల్లిస్తోంది. అయితే హైదరాబాద్‌ కమిషనరేట్‌లో పని చేస్తున్న వారికి ఈ నెల 4నే వేతనాలు బ్యాంకు ఖాతాలో జమచేశారు. మిగిలిన కమిషనరేట్లు, జిల్లాల్లో ఇప్పటివరకు వేతనాలు అందలేదు. నెలలో 15వ తేదీ సమీపించినా జీతాలు రాకపోవడంతో అప్పులు చేస్తున్నట్టు హోంగార్డులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారికి వేతనాలు అందాయని, తమకు ఇంకా రాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

అకారణంగా రూ.10వేల కోత... 
ఎలాంటి కారణం చెప్పకుండానే ఏప్రిల్‌ నెల వేతనంలో రూ.10వేల కోత విధించినట్టు తెలిసింది. కరోనా సమయంలో కూడా వేతనాలు చెల్లించిన పోలీస్‌ శాఖ ఇప్పుడు ఏ కారణంతో రూ.10వేల కోత విధించిందో తెలియడం లేదని, మే నెల జీతమైనా సమయానికి వస్తుందిలే అనుకుంటే అదీ ఇంకా అందలేదని వారు వాపోతున్నారు. ఈ నెలలో కూడా కోత పెడితే తమ పరిస్థితి అగమ్యగోచరమేనని అంటున్నారు.  

అసోసియేషన్లు ఎక్కడున్నాయి... 
తమ సంక్షేమం కోసం ఏర్పడిన అసోసియేషన్లు ఈ సమస్యను ఏమాత్రం పట్టించుకోవడం లేదని హోంగార్డులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక అసోసియేషన్‌గా ఏర్పడి, ఇప్పుడు రెండు మూడు సంఘాలుగా విడిపోవడంతో అసలు అసోసియేషన్లు ఉన్నాయా, లేవా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top