వడివడిగా వడ్ల కొనుగోళ్లు

Telangana: Paddy Procurement Revived With CM KCR Orders - Sakshi

ఒక్కరోజే 1.25 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ 

సీఎం ఆదేశాలతో పుంజుకున్న ధాన్యం కొనుగోళ్లు 

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం పంట కొనుగోళ్లు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. యాసంగిలో వరిసాగు వద్దంటున్న నేపథ్యంలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వానాకాలం ధాన్యాన్ని త్వరితగతిన సేకరించి, రైతుల్లో ఆందోళనను తొలగించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.

జిల్లాల వారీగా కలెక్ట ర్లు, అదనపు కలెక్టర్లు, సీఎస్‌వోలు వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, మిల్లులకు పంపించారు. వర్ష సూచనల నేపథ్యంలో సోమ, మంగళ వారాల్లో భారీగా కొనుగోళ్లు జరిగేలా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కమిషనర్‌ ను ఆదేశించారు. 

21.30 లక్షల మెట్రిక్‌ టన్నులు... 
హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో ఈ సీజన్‌లో 6,876 కొనుగోలు కేంద్రాలను తెరవాలని నిర్ణయించగా, 5,928 సెంటర్లు ప్రారంభమయ్యాయి. వీటి లో 4,446 కేంద్రాల్లో కొనుగోళ్లు సాగుతున్నాయి. ఇప్పటివరకు 3.52 లక్షల మంది రైతులనుంచి రూ. 4,171 కోట్ల విలువైన 21.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రూ.1,546 కోట్లు జిల్లాలకు విడుదలయ్యాయి. సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు చాలా జిల్లాల్లో లారీల కాంట్రాక్టులు కొలిక్కి రాలేదు. దీంతో జిల్లా మేనేజర్లను టెండర్లను త్వరితగతిన పూర్తి చేయా లని పౌరసరఫరాల సంస్థ ఆదేశించింది. 

కొనుగోలు చేస్తాం 
వానాకాలంలో రైతులు పం డించిన పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తాం. అకాల వర్షాలు, వాతావరణంలో మంచు, తేమ పెరగడం వంటి కారణాల వల్ల కొనుగోళ్లలో  జాప్యం జరిగిందే తప్ప ఇతర ఇబ్బందుల్లేవు. గత సంవత్సరం నవంబర్‌ 27 నాటికి 19.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈసారి 21.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాం.
– మంత్రి గంగుల  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top