TS: ‘పది’లో ఆరు పేపర్లే..

Telangana: Only Six Papers For Class Tenth Exams This Year - Sakshi

ఈ ఏడాది టెన్త్‌ పరీక్షల్లో మార్పులు చేసిన సర్కారు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈసారి పదో తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లే ఉండనున్నాయి. ఇప్పటివరకు హిందీ మినహా మిగతా ఐదు సబ్జెక్టులకు రెండు చొప్పున పరీక్షలు నిర్వహించగా.. ఈ ఏడాది ఒక్కో సబ్జెక్టుకు ఒక్క పేపర్‌ మాత్రమే నిర్వహించనున్నారు. దీనితోపాటు పరీక్ష సమయాన్ని అరగంట పాటు పెంచారు. బహుళ ఐచ్చిక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

కరోనా ఎఫెక్ట్‌తో.. 
గత ఏడాది లాక్‌డౌన్‌ సమయం నుంచే పాఠశాలల మూసివేతతో విద్యార్థులకు బోధన సరిగా జరగలేదు. దీంతో పదో తరగతిలో ఆరు పరీక్షలే నిర్వహించాలని గత ఏడాదే నిర్ణయించారు. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్నల్స్‌ మార్కుల ఆధారంగా అందరినీ పాస్‌ చేశారు. ఈ ఏడాది మొదట్లోనూ అదే తరహా పరిస్థితి ఎదురైంది. కానీ కాస్త ఆలస్యంగానైనా ఆన్‌లైన్‌ క్లాసులు జరిగాయి. సెప్టెంబర్‌ నుంచి ఆఫ్‌లైన్‌ క్లాసులు కూడా మొదలయ్యాయి.

అయినా విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధన అందని పరిస్థితి ఉందని ‘స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (టీఎస్‌సీఈఆర్‌టీ)’పేర్కొంది. పదో తరగతికి ఆరు పేపర్లే పెట్టాలని సిఫారసు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ.. 2021–22 ఏడాదికి సంబంధించి టెన్త్‌ పరీక్షలను కుదిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో సుమారు ఐదున్నర లక్షల మంది విద్యార్థులకు ఉపశమనం కలుగనుంది.  

ఇదే తొలిసారి 
ఉమ్మడి రాష్ట్రంలో 1971లో ఎస్‌ఎస్‌సీ బోర్డు ఏర్పాటైంది. అప్పట్నుంచీ 11 పేపర్ల విధానమే కొనసాగుతోంది. వాటిని ఆరుకు కుదించడం బోర్డు చరిత్రలో ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి తొలినాళ్లలో 9, 10 తరగతులు రెండింటి నుంచీ ప్రశ్నలిచ్చేవారు. దీనివల్ల విద్యార్థి సృజనాత్మకత, జ్ఞాపకశక్తి, నైపుణ్యం తెలుసుకునే అవకాశం ఉండేదని చెప్పేవారు. తర్వాత ఆ విధానాన్ని సరళీకరించి పదో తరగతి పాఠాలకే పరిమితం చేశారు.

కొన్నేళ్ల కింద మరోసారి పరీక్షల విధానాన్ని మార్చారు. పబ్లిక్‌ పరీక్షల ద్వారా విద్యార్థికి ఇచ్చే మార్కులను ఒక్కో సబ్జెక్టులో గరిష్టంగా 80కి పరిమితం చేశారు. మిగతా 20 మార్కులను ఇంటర్నల్స్‌ ద్వారా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే విధానం కొనసాగనుంది. రెండు పేపర్లలో గతంలో ఏ విధంగా ప్రశ్నలు ఇచ్చారో.. అదే తరహాలో ఇప్పుడూ ప్రశ్నల శాతాన్ని ఖరారు చేసేఅవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. 

సిలబస్‌ గందరగోళం! 
కోవిడ్‌ నేపథ్యంలో మొత్తం సిలబస్‌ బోధించడం కష్టమని భావించిన విద్యాశాఖ దాన్ని 30 శాతం మేర తగ్గించింది. కానీ దీనిపై ఇంతవరకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వలేదు. ఇంకా బోధించని పాఠాలను నిలిపివేస్తారా? ఎవైనా నిర్థిష్టమైన పాఠాలను ఎంపిక చేసి, కోత పెడతారా? అన్నది తేల్చాల్సి ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ‘‘ప్రభుత్వ స్కూళ్లలో కొంత సిలబస్‌ పూర్తికాలేదు.

ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పటికే సిలబస్‌ పూర్తి చేసుకుని, రివిజన్‌ మొదలుపెట్టాయి. సిలబస్‌ కోత విషయంలో ఆచితూచి అడుగేయకపోతే ఇబ్బందులు ఉంటాయి’’అని యూటీఎఫ్‌ అధ్యక్షుడు జంగయ్య తెలిపారు. సిలబస్‌పై విద్యాశాఖ వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని, నాణ్యతకు పదునుపెట్టే సబ్జెక్టుల్లో కోత పెట్టొద్దని మరో ఉపాధ్యాయ సంఘం నేత నర్సిరెడ్డి సూచించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top