సర్వాయి పాపన్న తెలంగాణకు గర్వకారణం

Telangana Ministers Pays Tributes To Sardar Sarvai Papanna - Sakshi

ఘనంగా జయంతి వేడుకలు   

గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్‌): బహుజన చక్రవర్తి సర్దార్‌ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని రాష్ట్రమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. సర్వాయి పాపన్న యావత్‌ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు. రవీంద్ర భారతిలో గురువారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్‌ మహారాజ్‌ 372వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం  శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ...తెలంగాణ వాడి వేడిని నాడే చాటిచెప్పిన శౌర్యుడు పాపన్నని కొనియాడారు.  రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చామని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై నీరా కేంద్రం, గౌడ ఆత్మగౌరవ భవనాలను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ బహుజన ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు నగరంలో విలువైన భూములను ఇవ్వడంతోపాటు రూ.95 కోట్లను విడుదల చేశారని వెల్లడించారు.

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంటే వాటి మీద కనీసం అవగాహన లేని వ్యక్తులే విమర్శలు చేస్తున్నారని దుయ్య బట్టారు. కార్యక్రమంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంక టేశం, ఎక్సైజ్‌ శాఖ కమి షనర్‌ సర్పరాజ్‌ అహ్మద్, ఎస్‌.హరిశంకర్‌ గౌడ్, పల్లె లక్ష్మణ్‌ రావుగౌడ్, వివిధ సంఘాలకు చెందిన బీసీ నాయకులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top