లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ | Telangana Minister Sridhar Babu envisions the state as a world-class life sciences hub | Sakshi
Sakshi News home page

లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ

Jul 6 2026 8:23 PM | Updated on Jul 6 2026 8:27 PM

 Telangana Minister Sridhar Babu envisions the state as a world-class life sciences hub

సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య రంగంలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులను అవకాశాలుగా అందిపుచ్చుకునేలా... తెలంగాణను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని  ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కరకపట్లలోని బయోటెక్ పార్క్ ఫేజ్ – 3 లో రూ.800 కోట్ల పెట్టుబడితో సిరో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. పరిశోధన, సాంకేతికత, ఏఐ, అధునాతన తయారీ, నైపుణ్యాభివృద్ధిని సమన్వయం చేస్తూ... భవిష్యత్తులో హెల్త్ కేర్ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా సమగ్ర ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ... పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. జహీరాబాద్ నిమ్జ్ ను మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించామన్నారు. రాష్ట్రంలో ‘గ్రీన్ ఫార్మా’ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని... పర్యావరణహిత పద్ధతుల్లో ఔషధాలను ఉత్పత్తి చేసేలా పరిశ్రమలను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి వచ్చేలా... తెలంగాణ నుంచే ఒక కొత్త మాలిక్యూల్ ఆవిష్కృతం కావాలని ఆకాంక్షించారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. 

తెలంగాణ రైజింగ్–2047, నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ ద్వారా పరిశోధన నుంచి ఉత్పత్తి వరకు అన్ని దశలను అనుసంధానించేలా ఒక ప్రత్యేక వ్యవస్థను నిర్మిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా బయోలాజిక్స్, బయోసిమిలర్స్, సెల్ అండ్ జీన్ థెరపీలు, ఏఐ, డిజిటల్ హెల్త్ తదితర అత్యాధునిక రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ, హిల్ట్ పాలసీలపై ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. రెండున్నరేళ్లలో పారిశ్రామికంగా రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి ఓర్వలేకే ప్రజలను తప్పుదోవ పట్టించేలా అదే పనిగా మాపై బురద చల్లుతున్నాయన్నారు. 

తాజాగా ప్రారంభించిన ఈ ప్లాంట్ లో అత్యాధునిక కంటైన్‌మెంట్ టెక్నాలజీని ఉపయోగించి... క్యాన్సర్ నివారణకు సంబంధించిన ఓరల్ ఆంకాలజీ ఔషధాలు, స్టెరిలైజ్డ్ ఇంజెక్టబుల్స్, లైయోఫిలైజ్డ్ పౌడర్ ఇంజెక్షన్లు, సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ ను ఉత్పత్తి చేస్తారన్నారు. ఇక్కడ కొత్తగా 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్నారు. దేశీయ ఫార్మా రంగ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా తెలంగాణ స్థానాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కంపెనీ ప్రతినిధులు డా.గోవింద రెడ్డి, డా.మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement