పెళ్లినాటికి నాకు సైకిల్, రెండు గేదెలే... కానీ, ఇప్పుడు

Telangana: Malla Reddy Inaugurated Property Expo In Saroornagar Stadium - Sakshi

హుడాకాంప్లెక్స్‌(రంగారెడ్డి జిల్లా): ‘నా పెళ్లి(1976) నాటికి సైకిల్, రెండు పశువులు మాత్రమే ఉండె. కానీ, ఇప్పుడు వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి. అతిపెద్ద విద్యాసంస్థలు స్థాపించా. సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో మంత్రిని కూడా అయ్యా’ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్‌పోను శనివా రం ఆయన ప్రారంభించారు.

మంత్రి మాట్లాడుతూ తాను ఎంతో కష్టపడ్డానని, అనేక వ్యాపారాలు చేసి, ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదిగానని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్, మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేశానని చెప్పారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రపంచ నగరాలకు దీటుగా హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి చెప్పారు.

అభివృద్ధి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ముందుచూపుతో నగరం నలమూలలా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. దేశవ్యాప్తంగా రియల్‌ఎస్టేట్‌ రంగం కుదేలైనా హైదరాబాద్‌లో మాత్రం శరవేగంగా దూసుకుపోతోందని, ప్రభుత్వం ఈ రంగానికి ప్రోత్సాహకాలు అందజేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.  

బెంగళూరు కాదు, హైదరాబాదే.. 
ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు గుర్తుకొ చ్చేదని, కానీ ఇప్పుడు కేటీఆర్‌ చొరవతో హైదరాబాద్‌ ఐటీ హబ్‌గా మారిందని, ప్రపంచ స్థాయి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, వాటి ముఖ్య కార్యాలయాలు ఇక్కడే కొలువుదీరాయని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎల్‌బీ నగర్‌లో చేపట్టిన అభివృద్ధి వల్ల ఈస్ట్‌జోన్‌ వైపు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుందని తెలిపారు.

నాగోలు నుంచి గండిపేట వరకు మూసీకి ఇరువైపులా రూ.1,370 కోట్ల వ్య యంతో 120 అడుగుల రోడ్డు నిర్మించేందు కు ప్రణాళికలు రూపొందించామని చెప్పా రు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, ఫిర్జాదిగూడ, బోడుప్పల్‌ మేయర్లు వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి నరసింహారావు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top