చావనైనా చస్తాం... కేసీఆర్‌ను వదిలివెళ్లం...

Telangana Leaders Pay Floral Tribute To Dr Ambedkar 66th Death Anniversary - Sakshi

అంబేడ్కర్‌ వర్థంతి కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం 

సాక్షి, హైదరాబాద్‌: చావనైనా చస్తాం, కానీ సీఎం కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్లబోమని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పార్టీ మారే శాసనసభ్యుల నియోజకవర్గాలు అంటూ బాన్సువాడ పేరు మీడియాలో వచ్చిందని, కానీ బాన్సువాడ శాసనసభ్యుడిగానే తన వైఖరిని స్పష్టం చేస్తున్నానని అన్నారు. మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 66వ వర్థంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహానికి స్పీకర్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ శాసనసభ్యులు ఎవరు కూడా డబ్బులకు అమ్మడుపోయేవారు కాదు. అది ఊహాజనితం మాత్రమే, ఎవరైనా ఆశపడితే చేతులు కాల్చుకుని భంగపడతారు’ అని వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బలపరచడంతోపాటు సీఎంగా ఆయన తీసుకునే నిర్ణయాలను అమలు చేస్తాం. ప్రభుత్వాలను కూల్చడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.

ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలి’అని అన్నారు. అంబేడ్కర్‌ ఆశయాలను నూరు శాతం అమలు చేయడంలో కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని స్పీకర్‌ పేర్కొన్నారు. ఆరోపణలు చేసేవారు కాకుండా ఆలోచించేవారే పారిపాలన చేయగలరని పేర్కొన్నారు. పాదయాత్రల పేరిట విమర్శలు, అసత్యాలు ప్రచారం చేయకుండా ప్రజలకు ఏం చేస్తారో నాయకులు చెప్పాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, దండె విఠల్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి.నరసింహాచార్యులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top