సీఎం కేసీఆర్‌ పథకానికి పైసల్లేవా? ఏంటీ పరిస్థితి! | Sakshi
Sakshi News home page

‘కిట్‌’కు పైసల పరేషాన్‌.. కేసీఆర్‌ కిట్ల పథకాన్ని వేధిస్తున్న నిధుల కొరత

Published Tue, Aug 30 2022 2:42 AM

Telangana: KCR Kits Scheme Is Plagued By Lack Of Funds - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌: బాలింతలకు అండగా నిలిచే కేసీఆర్‌ కిట్ల పథకాన్ని నిధుల కొరత వేధిస్తోంది. దీంతో ప్రోత్సాహకపు సొమ్ము, కిట్ల పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిడ్డలకు జన్మనిచ్చిన కొందరు తల్లులు.. నగదు ప్రోత్సాహకం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కక పోవడంతో నిరాశకు గురవుతున్నారు. బాలింతగా ఉన్నప్పుడు అందాల్సిన సాయం.. కొందరికి ఏడాదికి పైగా గడిచినా అందడం లేదనే విమర్శలున్నాయి. దాదాపు రూ.400 కోట్లకు పైగా ప్రోత్సాహకపు సొమ్ము బకాయి ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.  

ఐదేళ్లలో 13.58 లక్షల ప్రసవాలు.. 
ముఖ్యమంత్రి పేరిట కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని 2017లో ప్రారంభించారు. అప్పట్నుంచీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. 2017 జూన్‌ 2 నుంచి ఈ ఏడాది ఆగస్టు ఐదో తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌లో కలిపి మొత్తంగా దాదాపు 28.53 లక్షల ప్రసవాలు జరగ్గా..అందులో 13.58 లక్షల ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగాయి. మగ బిడ్డ పుడితే తల్లికి రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు రెండు దఫాలుగా ఇస్తున్నారు.

అలాగే తల్లికి, బిడ్డకు రెండు జతల దుస్తులు, పిల్లలకు వెచ్చగా ఉండడానికి పరుపు, నూనె, సబ్బు, పౌడర్‌ వంటి 15 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను కూడా బాలింతకు ఇస్తున్నారు. అన్ని విధాలా ప్రయోజనకారిగా ఈ కిట్‌లకు మంచి డిమాండ్‌ ఉంది. అయితే ఈ కిట్లు ఆశించిన మేరకు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు ప్రోత్సాహకంగా అందాల్సిన నగదు కూడా కొన్నాళ్లుగా నిధుల కొరత వల్ల అందడం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఆసుపత్రుల్లోని డాక్టర్లను అడిగితే కిట్లు రాలేదని అంటున్నారని చెబుతున్నారు.  

లక్షన్నరకు పైగా కిట్లు పెండింగ్‌లో.. 
ఇప్పటివరకు మొత్తం 13.58 లక్షల మంది లబ్ధిదారులకు గాను 12.02 లక్షల కిట్లు అందజేశారు. అంటే మరో లక్షన్నరకు పైగా కిట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ఆయా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.12 వేల చొప్పున వేసుకున్నా, రూ.1,629 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు రూ.1,217 కోట్లు మాత్రమే అందజేశారు. అంటే రూ.412 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇస్తారు. అలా చూస్తే ఇంకా పెద్ద మొత్తమే పెండింగ్‌లో ఉండి ఉంటుందని అర్థ్ధమవుతోంది.  

వివరాలు నమోదు చేసుకున్నారు కానీ.. 
ఈ నెల 15 వ తేదీన భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో నాకు రెండో కాన్పుగా ఆడపిల్ల జన్మించింది. కేసీఆర్‌ కిట్‌ మాత్రం అందజేశారు. ప్రభుత్వం అందించే డబ్బులు ఇచ్చేందుకు వివరాలు మాత్రం తీసుకున్నారు. మొదటి కాన్పు సమయంలో డబ్బులు, కేసీఆర్‌ కిట్టు రెండూ అందాయి.    
– చలకోటి స్వరూప, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం 

కిట్‌ మాత్రం ఇచ్చారు  
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఈ నెల 15న నాకు మగబిడ్డ పుట్టాడు. కేసీఆర్‌ కిట్‌ మాత్రం ఇచ్చారు. డబ్బుల కోసం అడిగితే ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేయలేదని చెప్పారు. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. అప్పుడు తొలుత రూ. 5 వేలు, తర్వాత కొంత ఆలస్యంగా రూ.8 వేలు అందాయి.     
– దుర్గా భవాని, భద్రాచలం 

రెండేళ్లయినా డబ్బులు రాలేదు  
2020 ఆగస్టు 21వ తేదీన మానుకోట ఏరియా ఆసుపత్రిలో మొదటి కాన్పు ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చా. కేసీఆర్‌ కిట్టు ఇచ్చారు కానీ, డబ్బులు ఇంకా రాలేదు. 
– మంజుల, కంబాలపల్లి గ్రామం, మహబూబాబాద్‌ 

ఏడాదిగా ఎదురుచూపులు 
గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ములుగు ఏరియా ఆసుపత్రిలో నాకు డెలివరీ అయ్యింది. ఏడాదిగా ఎదురుచూస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి డబ్బులు రాలేదు.  
– ప్రియాంక, ఏటూరునాగారం, ములుగు జిల్లా   

Advertisement
 
Advertisement
 
Advertisement