ఇంటర్‌ సిలబస్‌ 70 శాతానికి కుదింపు 

Telangana Intermediate Board Announced To Reduce Syllabus To 70 Percent - Sakshi

ఇంటర్‌ బోర్డ్‌ అధికారిక ఉత్తర్వులు  

వెబ్‌సైట్‌లో నమూనా ప్రశ్నపత్రాలు, సిలబస్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సిలబస్‌ను 30 శాతం తగ్గిస్తూ ఇంటర్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం వెలువరించింది. కరోనా నేపథ్యంలో ఫస్టియర్‌ సిలబస్‌ను గతేడాది 70 శాతం అమలు చేశారు. దీనికి కొనసాగింపు పాఠ్యాంశాలు రెండో సంవత్సరంలో ఇంతకాలం బోధించడం వల్ల విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

మరో వైపు ఈ ఏడాది కూడా ప్రత్యక్ష బోధన ఆలస్యంగా మొదలైంది. ఆన్‌లైన్‌ క్లాసులు జరిగినా కొంతమంది విద్యార్థులు దీన్ని అందుకోలేకపోయారు. మారుమూల గ్రామాల్లో సరైన ఇంటర్నెట్‌ సదుపాయం లేకపోవడం, మొబైల్‌ సిగ్నల్స్‌ అందకపోవడం వల్ల బోధన అరకొరగా జరిగిందని విద్యార్థులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) కూడా ఇదే తరహాలో సిలబస్‌ తగ్గింపుపై ప్రతిపాదనలు పంపింది.

దీనిపై ఇంటర్‌ బోర్డ్‌ సానుకూలంగా స్పందించి, ప్రభుత్వానికి తగ్గింపుపై నివేదిక పంపింది. ఇటీవల ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో 30 శాతం సిలబస్‌ తగ్గింపు నిర్ణయాన్ని ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. తగ్గించిన సిలబస్, నమూనా ప్రశ్నపత్రాలను విద్యార్థుల కోసం బోర్డ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటుల ఉంచినట్టు బోర్డ్‌ తెలిపింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top