అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

Telangana High Court Warns GHMC Officials Over Illegal Constructions In Hyderabad City - Sakshi

సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని నగరంలో ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అనేక మంది కోర్టులను ఆశ్రయిస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదని అక్షింతలు వేసింది. ఈ అంశంపై ఇకపై పిటీషన్ల దాఖలు కాకూడదని అధికారులను హెచ్చరించింది.

అధికారులు కఠిన చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించింది. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లను కోరింది. 2019లో ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించారు? వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలో పొందుపరచాలని సూచించింది. స్టేలు తొలగించాలని ఎన్ని పిటిషన్లు వేశారో తెలపాలని కోరింది. స్టే వెకేట్ పిటిషన్లు వేయని పక్షంలో కారణాలు తెలపాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

పీపీల నియామకంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి..
పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల కొరత వల్ల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. క్రిమినల్‌ కేసుల విచారణ ప్రక్రియలో పీపీల పాత్ర కీలకమని వ్యాఖ్యానించింది. పీపీల నియామకంపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. 414 పీపీ పోస్టులకు గాను 212 పోస్టులు భర్తీ అయ్యాయని, మిగిలిన పోస్టుల భర్తీ విషయమై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. దీనిపై కోర్టు ఘాటుగా స్పందిస్తూ.. చర్చలు కాదు, ఫలితాలు కావాలని వ్యాఖ్యానించింది. అలాగే ప్రాసిక్యూషన్‌ విభాగానికి పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై రెండు వారాల్లో పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించి, తదుపరి విచారణను ఏప్రిల్‌ 14కు వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top