నిధులు సీసీఎస్‌లో జమ చేయండి.. తెలంగాణ ఆర్టీసీకి హైకోర్టు ఆదేశం | Telangana High Court order to RTC about ccs | Sakshi
Sakshi News home page

నిధులు సీసీఎస్‌లో జమ చేయండి.. తెలంగాణ ఆర్టీసీకి హైకోర్టు ఆదేశం

Apr 12 2023 4:05 AM | Updated on Apr 12 2023 8:12 AM

Telangana High Court order to RTC about ccs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఆర్టీసీ సిబ్బంది వేతనం నుంచి ప్రతి నెలా తీసుకున్న నిధులను ఉద్యోగుల సహకార పరపతి సంఘానికి (సీసీఎస్‌) జమ చేయాలని.. యాజమాన్యం వాటిని తన సొంత అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదని హైకోర్టు ఆదేశించింది. సొసైటీ తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటోందని, కోలుకోలేని నష్టాల్లో ఉందని గుర్తుంచుకోవాలని ఆర్టీసీ ఎండీ, చీఫ్‌ మేనేజర్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

సీసీఎస్‌కు జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంతానికి వాడేసుకోవడంతో వడ్డీ సహా రూ.900 కోట్ల బకాయిలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఉద్యోగులకు ఈ సంఘం ద్వారా మంజూరు చేయాల్సిన రుణాలు ఆగిపోయాయి. దీంతో బకాయిల్లో కొంత మొత్తం చెల్లించాలని ఆ సంఘం ఆర్టీసీని కోరుతున్నా స్పందన రాలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు.  

ప్రతినెలా జీతాల నుంచి కట్‌ చేస్తున్నా.. 
సీసీఎస్‌ తరఫున న్యాయవాది ఏకే జయప్రకాశ్‌రావు వాదనలు వినిపించారు. ‘ఉద్యోగుల నుంచి ప్రతి నెలా నిధులు సేకరిస్తున్నారు. సిబ్బంది జీతాల నుంచి కట్‌ చేసిన మొత్తాన్ని సీసీఎస్‌ ఖాతాలో జమ చేయాల్సి ఉంది. కానీ ఆర్టీసీ వాటిని సొంతానికి వాడుకుంటోంది. ఇది సరికాదు. ఆ నిధులన్నీ సీసీఎస్‌ ఖాతాలో జమ చేసేలా ఆదేశాలు జారీ చేయాలి..’అని కోరారు. ఆర్టీసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిధుల విడుదల విషయంలో ప్రభుత్వంతో సంస్థ ఎండీ చర్చలు జరుపుతున్నారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రతినెలా సీసీఎస్‌ ఖాతాల్లో నిధులు జమ చేయాలని ఆదేశించారు.  

కార్మిక శాఖకు నోటీసులు 
ఆర్టీసీ గుర్తింపు సంఘానికి ఎన్నికల నిర్వహణపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కార్మిక అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ హైకోర్టును ఆశ్రయించింది.

కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్, ఆర్టీసీ ఎండీతో పాటు పలువురిని ప్రతివాదులుగా చేర్చింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నందా మంగళవారం విచారణ చేపట్టారు. అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement