
హైడ్రా తీరుపై మరోసారి హైకోర్టు ఆగ్రహం
తీరు మార్చుకోకుంటే కఠిన నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నంబర్ 37, 38/1లో 1.07 ఎకరాల భూమిపై ఎందుకంత దూకు డుగా వెళ్తున్నారని హైడ్రా (హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తి సంరక్షణ విభాగం) కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు స్టేటస్‌కో ఆదేశాలు పాటించాలని చెప్పినా వినకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని, కొందరు దీన్ని వాడుకుని ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని పేర్కొంది.
చెరువులు, ప్రభుత్వ భూముల రక్షణ పేరుతో ప్రజలను అవస్థలకు గురిచేయడం, హడావుడి చేయడం ఎందుకని ప్రశ్నించింది. సరిహద్దుల్లో యుద్ధానికి వెళ్తున్నట్లు వాహనాలకు ఆ రంగులేంటని అడిగింది. ఇలానే చట్టవిరుద్ధంగా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తే కోర్టుకు రప్పించి.. కఠిన శిక్షలు విధించడానికి వెనుకాడబోమని తేల్చిచెప్పింది.
తన భూమిలో హైడ్రా చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకుంటోందంటూ జూబ్లీహిల్స్‌కు చెందిన ఎస్.వెంకటేశ్వర్‌రావు ఏప్రిల్ 23న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరో ఇద్దరు పిటిషన్లు వేశారు. మొత్తంగా 6 ఎకరాల భూమి తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉందంటూ హైడ్రా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.
ఎఫ్‌టీఎల్ నిర్ధారించారా?
హైకోర్టు ఏప్రిల్ 23న ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ హైడ్రా తమ భూమిలో జోక్యం చేసుకునేందుకు యత్నిస్తోందని జూన్ 11న వెంకటేశ్వర్‌రావుతోపాటు మరో ఇద్దరు ధిక్కరణ పిటిషన్లు వేశారు. వీటిపై బుధ వారం జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మా సనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది తరుణ్ జి.రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కోర్టు స్టేటస్‌కో ఆదేశాలు ఇచ్చినా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ లెక్కచేయలేదని, తమ్మిడికుంట ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ను నిర్ధారించకుండానే దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
వాదన లు విన్న న్యాయమూర్తి.. హైడ్రా కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన అధికారులు.. హడావుడి నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు న్నారన్నారు. తాము నిలుపుదల ఆదేశాలు ఇవ్వని చెరువులున్న ప్రాంతాల్లో మునకపై ఏ చర్యలు తీసుకున్నారని, ఎఫ్‌టీఎల్‌పై ఇప్పటివరకు విధాన పరమైన నిర్ణయం తీసుకున్నారా అని నిలదీశారు. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేశారు.