జీహెచ్‌ఎంసీ అధికారులు సిగ్గుపడాలి

Telangana High Court Fires On GHMC Officials - Sakshi

రోడ్లపై గుంతల పూడ్చివేతలో ఇంత నిర్లక్ష్యమా? 

ప్రజల ప్రాణాలు పోతున్నా చూస్తూ ఊరుకోవాలా? 

హైకోర్టు ఆగ్రహం.. 20వ తేదీలోగా నివేదికలకు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌:  వర్షాకాలం వచ్చినా నగర వ్యాప్తంగా రోడ్ల మీద ఉండే గుంతలు పూడ్చివేయకుండా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టు మండిపడింది. ఇద్దరు సీనియర్‌ సిటిజన్లు గత కొన్నేళ్లుగా వారికి వచ్చే పెన్షన్‌ డబ్బుతో ప్రమాదాలకు కారణమవుతున్న గుంతలను స్వచ్ఛందంగా పూడ్చుతున్నారని, ఇందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిగ్గుపడాలని వ్యాఖ్యానించింది. జీహెచ్‌ఎంసీ అధికారుల జీతాల్లో కొంత మొత్తాన్ని తిలక్‌ దంపతులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో గుంతల పూడ్చివేతకు ఏం ప్రణాళికలు రూపొందించారు? ఎన్ని గుంతలను గుర్తించారు? వాటిలో ఎన్నింటిని పూడ్చివేశారు?  తదితర వివరాలతో జీహెచ్‌ఎంసీ కమిషనర్, అన్ని జోన్ల డిప్యూటీ కమిషనర్లు, సూపరిం టెండెంట్‌ ఇంజనీర్లు ఈ నెల 20లోగా వేర్వేరుగా  నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి గంగాధర్‌ తిలక్‌ దంపతులు వారికి వచ్చే పెన్షన్‌ డబ్బులతో రోడ్లమీద గుంతలను పూడ్చుతున్నారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. నగరంలో ఎక్కడ గుంతలు ఉన్నాయో తిలక్‌ దంపతులు గుర్తించి వారి కారులో వెళ్లి ఆ గుంతలను పూడుస్తున్నప్పుడు.. జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆ గుంతలు ఎందుకు కనిపించడం లేదని ధర్మాసనం నిలదీసింది. 

బడ్జెట్‌ తగ్గించాలని ఆదేశించాలా ? 
అధికారులు  కష్టపడి రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారని, వర్షాలతోపాటు భారీగా వాహ నాలు తిరుగుతుండడంతో తరచుగా గుం తలు ఏర్పడుతున్నాయని జీహెచ్‌ఎంసీ తరఫున హాజరైన న్యాయవాది పాశం కృష్ణారెడ్డి హైకోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘గుంతలు ఏర్పడడానికి వర్షాలను ఎందుకు నిందిస్తారు? వాహనాలు తిరిగితే గుంతలు పడతాయని భావిస్తే, అవి తిరగకుండా నిషేధిస్తారా ? అధికారులు పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. గుంతలతో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నా.. ఊరుకోవాలా? చేయాల్సిన పనిచేయనప్పుడు జీహెచ్‌ఎంసీకి బడ్జెట్‌ తగ్గించాలని ఆదేశించాలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top