Rahul Gandhi: హైకోర్టులో కాంగ్రెస్‌కు చుక్కెదురు

Telangana High Court Dismissed Rahul Gandhi TO Visit Petition - Sakshi

జోక్యం చేసుకోలేం

రాహుల్‌.. ఓయూ పర్యటనకు

అనుమతి ఇవ్వాల్సింది వీసీనే: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, నిర్ణయం తీసుకోవాల్సింది వైస్‌ చాన్స్‌లరేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఉస్మానియా రిజిస్ట్రార్‌.. రాహుల్‌ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై మానవతారాయ్‌ సహా మరో ముగ్గురు లంచ్‌ మోషన్‌ను పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. రాజకీయ పార్టీలు, మతపరమైన కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వరాదని 2021లో వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశం తీర్మానం చేసిందని, దీని ప్రకారం రాహుల్‌గాంధీ నిర్వహించే రాజ కీయ కార్యక్రమానికి అనుమతి సాధ్యం కాదని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ తరఫు న్యాయవాది వాదించారు.

ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ తీర్మానాన్ని పిటిషనర్లు సవాల్‌ చేయలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదని చెప్పారు. రాహుల్‌గాంధీతో ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి కోరుతూ పిటిషన్లు దాఖలు చేసిన వారెవ్వరూ వర్సిటీలో చదివే రెగ్యులర్‌ విద్యార్థులు కాదన్నారు. ఇలాంటి వాళ్లు కోరే సమావేశానికి అనుమతిస్తే బయట వ్యక్తులు కూడా ముఖాముఖికి హాజరయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. అంతేకాకుండా సిబ్బంది ఎన్నికలు కూడా జరగనున్నాయని చెప్పారు. పిటిషనర్లు నిర్వహిస్తామని చెబుతున్న ఠాగూర్‌ ఆడిటోరియానికి, ఎంబీఏ పరీక్షలు నిర్వహించే కేంద్రాలకు కేవలం రెండు కిలోమీటర్లలోపే దూరమని, పిటిషన్‌ను అనుమతిస్తే దాని ప్రభావం పరీక్షలు రాసే విద్యార్థులపై ప్రతికూలంగా పడే అవకాశం ఉంటుందన్నారు.

రాహుల్‌గాంధీతో విద్యార్థుల ముఖాముఖీకి అనుమతి ఇవ్వాలన్న పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. అనంతరం ఈ అభ్యంతరాలపై పిటిషనర్ల తరుఫు అడ్వొకేట్లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఎంకాం పరీక్షలు నడుస్తున్నాయని.. రాహుల్‌ పర్యటనతో శాంతిభద్రతల సమస్యలు వస్తాయన్న వీసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ వాదనలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెబుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే దీనిపై రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయవచ్చని చెప్పారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top