తెలంగాణ: కరోనా కేసులపై దొంగ లెక్కలు?

Telangana Health Department Hide Corona Figures - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: దేశంలో చాప కింద నీరులా కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. తెలంగాణ విషయానికొస్తే.. మొన్నటిదాకా రాజధాని హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని అనుకున్నారంతా. ఇప్పుడది పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చేరింది. భూపాలపల్లి, కరీంనగర్‌, తాజాగా మంచిర్యాలలో కోవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. కానీ, అధికారిక లెక్కల్లో మాత్రం వాటిని చూపడం లేదు!.  

కరోనా వైరస్‌లో జేఎన్‌.1 వేరియెంట్‌.. వ్యాప్తి శరవేగంగా ఉంటోంది. చలికాలం.. ఫ్లూ సీజన్‌ కావడంతో అప్రమత్తంగా ఉండాలని కేం‍ద్రం మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తోంది. అయితే ప్రజలను అప్రమత్తం చేయడంలో మాత్రమే కాదు.. ఆఖరికి కరోనా బులిటెన్‌ను విడుదల చేయడంలోనూ ఆరోగ్య శాఖ పూర్తి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. గత రెండు రోజలుగా కరోనా లెక్కలపై ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటనేం చేయడం లేదు. అధికారుల్ని అడిగితే.. ప్రభుత్వమే ఇకపై గణాంకాలు విడుదల చేస్తుందంటూ ఓ ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం కరోనా లెక్కలపై ఎటూ తేల్చడం లేదు. రెండ్రోజులకొకసారి విడుదల చేస్తారని చెప్పినా.. అందులోనూ స్పష్టత లేదు.

మరీ ఇంత తక్కువా?
రెండు రోజుల కిందట బులిటెన్‌ను పరిశీలిస్తే.. 1,333 టెస్ట్‌లు చేయగా అందులో ఎనిమిది మందికి మాత్రమే కరోనా పాజిటివ్ గా తేలిందట. మొత్తంగా.. ఆ రోజునాటికి యాక్టివ్‌ కేసుల సంఖ్యను 63గా పేర్కొంటూ.. రెండు కరోనా మరణాలు సంభవించాయని ప్రకటించి ఆపేశారు. అయితే.. జిల్లా వైద్యాధికారులేమో అధికారిక లెక్కల విషయంలో పొంతనే లేదంటున్నారు. 

వింటర్‌ సీజన్‌.. బస్సుల్లో రద్దీ, మెట్రోలో రద్దీ, పైగా పెళ్లిళ్లతో పాటు పండుగ సీజన్ కావడంతో ఎక్కువగా జనం చేరుతుండటం వల్ల కూడా కేసుల సంఖ్య పెరిగే ఉంటుందని వాళ్లు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగతంగా టెస్టులు చేయించుకుంటున్నవాళ్లు.. పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నవాళ్ల లెక్కను అందులో కావాలనే చేర్చడం లేదనే విమర్శా బలంగా వినిపిస్తోంది. మరోవైపు.. వైరస్‌ విజృంభించే అవకాశాలున్న సమయంలో రాష్ట్రంలో కొవిడ్‌ కేసులపై దాపరిక ధోరణి సరికాదంటున్నారు వైద్యనిపుణులు. కొత్తగా నియమించబడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ దీనిపై ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top