పాదచారులు గాల్లో నడవాలా?: హైకోర్టు ఆగ్రహం

Telangana HC Serious On Aggression Of Footpaths In Hyderabad - Sakshi

ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నా ఏం చేస్తున్నారు..?

వెంటనే ఆక్రమణలు తొలగించే దిశగా చర్యలు చేపట్టండి

సర్కారుకు హైకోర్టు ఆదేశం.. ఏప్రిల్‌ 15కు విచారణ వాయిదా  

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పాదచారులు గాల్లో నడవాలా అని ప్రశ్నించింది. ఫుట్‌పాత్‌లపై వెంటనే ఆక్రమణలను తొలగించాలని, ఇంతకుముందు తీసుకున్న చర్యలను వివరిస్తూ స్థాయి నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సమగ్ర సర్వే చేసి గతంలో ఉన్న ఫుట్‌పాత్‌లను తొలగిస్తే ఆ ప్రాంతంలో తిరిగి నిర్మించాలని, ప్రజలు సౌకర్యం గా నడిచేలా ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నా చర్యలు చేపట్టకపోవడాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది మామిడాల తిరుమలరావు వ్యక్తిగతంగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది.

నగరంలోని అనేక ప్రాంతా ల్లో ఫుట్‌పాత్‌లను తొలగించారని, కొన్ని చోట్ల ఫుట్‌పాత్‌లను వీధి వ్యాపారులు ఆక్రమించుకుంటున్నారని తిరుమలరావు వివరించారు. దీంతో గత్యంతరం లేక పాదచారులు రోడ్డుపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, ఈ సమయంలో ప్రమాదాలు జరిగితే పాదచారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా పేర్కొంటున్నారని తెలిపారు. ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ మార్గదర్శకాల ప్రకారం ఫుట్‌పాత్‌లను నిర్మించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని వివరించారు. ఈ పిటిషన్‌లో నగర పోలీసు కమిషనర్‌ను ఎందుకు ప్రతివాదిగా చేర్చారని ధర్మాసనం ప్రశ్నించగా.. కమిషనర్‌ కార్యాలయంతోపాటు పోలీస్‌స్టేషన్ల ఎదురుగా రోడ్లపైనే వాహనాలను అడ్డగోలుగా పార్క్‌ చేస్తున్నా పట్టించుకోవట్లేదని నివేదించారు.

‘రోడ్లు విస్తరణ చేయడంతో ఫుట్‌పాత్‌లను తొలగిస్తున్నారు. 1990ల్లో 10 ఫీట్లున్న ఫుట్‌పాత్‌లు రోడ్ల విస్తరణతో 5 ఫీట్లకు తగ్గాయి. ఇటీవల మెట్రో నిర్మాణానికి సంబంధించి పిల్లర్లను ఏర్పాటు చేయడంలో పూర్తిగా ఫుట్‌పాత్‌లను తొలగించారు. అక్కడక్కడ ఉన్న ఫుట్‌పాత్‌లను చిరువ్యాపారులు ఆక్రమించుకుంటున్నారు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు’అని జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి పేర్కొన్నారు. చిరువ్యాపారుల కోసం ప్రత్యేకంగా ప్రాంతాన్ని కేటాయించలేదా అని ధర్మాసనం ప్రశ్నించగా.. కొన్ని ప్రదేశాలను కేటాయించామని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని, ఈ దిశగా తామిచ్చిన ఆదేశాలను అమలు చేయాలని, తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 15కు వాయిదా వేసింది.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top