నీటి వాటా..ఆపరేషనల్‌ ప్రొటోకాల్‌ తేల్చాలి | Sakshi
Sakshi News home page

నీటి వాటా..ఆపరేషనల్‌ ప్రొటోకాల్‌ తేల్చాలి

Published Sat, Feb 3 2024 5:50 AM

Telangana Govt urges Centre to rectify discrepancies in KRMB meeting minutes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల వాటా తేలేదాకా...50:50 నిష్పత్తితో నీటిని పంచాలని, నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల ఆపరేషనల్‌ ప్రొటోకాల్‌ ఖరారు అయితేనే ప్రాజెక్టులు అప్పగిస్తామని తెలంగాణ స్పష్టం చేసినట్టు కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) వెల్లడించింది. ఈనెల 1వ తేదీన ప్రాజెక్టుల అప్పగింతపై కృష్ణా బోర్డు చైర్మన్‌ శివనందన్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సంబంధించిన మినట్స్‌ను బోర్డు శుక్రవారం విడుదల చేసింది.  

మినట్స్‌లో ఏముందంటే... 
► రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తేనే జలవిద్యుత్‌ కేంద్రాలు అప్పగించగలమని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ తెలిపినట్టు బోర్డు పేర్కొంది. 
► జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా రాసిన ఓ లేఖను ఈఎన్‌సీ మురళీధర్‌ బోర్డు చైర్మన్‌ అందజేశారు. ఆ లేఖను మినట్స్‌లో బోర్డు జతచేసింది. 
► నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులతోపాటు వాటి పరిధిలోని 15 కాంపోనెంట్లు అప్పగించాలని కృష్ణా నదీ యాజమాన్యబోర్డు(కేఆర్‌ఎంబీ) కోరింది. వీటి నిర్వహణకు భారీగా నిధులు అవసరం. ఆ నిధులను నిరంతరం రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయాలి. నాగార్జునసాగర్‌ డ్యామ్‌ పై మొహరించిన సీఆర్‌ పీఎఫ్‌ బలగాలు ఇరు రాష్ట్రాల అధికారులను ప్రాజెక్టుపై అనుమతిస్తాయి. ప్రాజెక్టుపై ఏ పనులు చేయాలన్నా... ఉద్యోగులను నియమించుకోవాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 

► త్రీమెంబర్‌ కమిటీ(కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శి, తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలు సభ్యులుగా ఉండే) తీసుకునే నిర్ణయాలు/ వాటర్‌ రిలీజ్‌ ఆర్డర్‌ కచి్చతంగా ఆయా కాంపోనెంట్లను అమలు చేయాలి. కమిటీ నిర్ణయాలు అమలు చేయాలి. 
► ఒకవేళ ప్రాజెక్టులను తెలుగు రాష్ట్రాలు బోర్డుకు అప్పగిస్తే... ఆ ప్రాజెక్టులపై ఆయా రాష్ట్రాల నుంచి సమాన స్థాయిలో ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు. వేతనాలతో పాటు ఇతర ప్రయోజనాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. ఏ మేరకు ఉద్యోగులు కావాలో, ఆ వివరాలన్నీ వారం రోజుల్లోపు బోర్డుకు అందించాలి. ప్రాజెక్టులన్నీ బోర్డు నియంత్రణలో ఉంటాయి. అయితే నిరంతర, అత్యవసర నిర్వహణ పనుల ను సంబంధిత రాష్ట్రాలు, ఇదివరకు ఉన్న పద్ధ తిని (శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ) పాటించాల్సి ఉంటుంది. సాగర్, శ్రీశైలం పరిధిలో ఉన్న కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఏపీ ఈఎన్‌సీ తెలిపారు. అయితే తెలంగాణ ప్రాజెక్టులతో పాటే మా ప్రాజెక్టులు తీసుకోవాలన్నారు.  

రాహుల్‌బొజ్జా లేఖలోని ముఖ్యాంశాలు  
జనవరి 17వ తేదీన ప్రాజెక్టుల అప్పగింతపై కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం తాలూకు మినట్స్‌కు సవరణలు చేయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి లేఖ రాశారు. అందులో ఏముందంటే....‘నీటి వాటాలు తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించలేం. ట్రిబ్యునల్‌ కృష్ణా జలాలను పంచేదాకా 50:50 నిష్పత్తితో నీటిని పంచాలి. శ్రీశైలం జలాశయం కట్టిందే జలవిద్యుత్‌ ఉత్పాదన కోసం...నాగార్జునసాగర్‌ కింద ఉన్న నీటి అవసరాలు తీర్చడానికి వీలుగా దీనిని కట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 830 అడుగులుగా ఉండాలి. ప్రాజెక్టుల ఆపరేషనల్‌ ప్రొటోకాల్‌ తేలేదాకా వాటిని అప్పగించలేం. ఇక జలవిద్యుత్‌ కేంద్రాలతో పాటు ప్రాజెక్టుల అప్పగించాలంటే తెలంగాణ ప్రభుత్వమే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రాజెక్టులు బోర్డుకు ఇవ్వలేం. 

ప్రాజెక్టులను అప్పగిస్తామని చెప్పకపోయినా, మినట్స్‌లో రికార్డు అయ్యింది: రాహుల్‌ బొజ్జా 
‘‘జనవరి 17వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కృష్ణా ప్రాజెక్టులను అప్పగిస్తామని చెప్పినట్టు మినట్స్‌లో రికార్డు అయ్యింది. అయితే తాము చెప్పిన అంశాలేవీ ఇందులో నమోదు కాలేదు. ఆ మినట్స్‌లో సవరణలు చేయాలని కోరుతూ జనవరి 27వ తేదీన కేంద్రానికి లేఖ రాశాం’అని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా చెప్పారు. శుక్రవారం ఆయన ఈఎన్‌సీ మురళీధర్‌తో కలిసి శుక్రవారం జలసౌధలో విలేకరులతో మాట్లాడారు. బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత నిర్ణయం గతంలోనే తీసుకున్నారని తెలిపారు. 2023–24 బడ్జెట్‌లో ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించనున్నామని, ఇందు కోసం సీడ్‌ మనీ కింద రూ.200 కోట్లు ఇవ్వనున్నామని ప్రతిపాదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించారు.  

ప్రాజెక్టులపై కృష్ణాబోర్డుది ప్రేక్షకపాత్ర: ఈఎన్‌సీ సి.మురళీధర్‌ 
సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై కృష్ణాబోర్డుది ప్రేక్షకపాత్ర మాత్రమేనని ఈఎన్‌సీ (జనరల్‌) మురళీధర్‌ స్పష్టం చేశారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలంటే నీటిని ఏ ప్రాతిపదికన పంచుకోవాలి అనే అంశాలతో ముడిపడిన ఆపరేషనల్‌ ప్రొటోకాల్‌పై తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని గుర్తు చేశారు. త్రీమెంబర్‌ కమిటీ (కృష్ణాబోర్డు మెంబర్‌ సెక్రటరీ/ కన్వినర్, తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలు) నిర్ణయం ఆధారంగానే నీటి విడుదల, పంపిణీ, పర్యవేక్షణ ఉంటుందన్నారు. జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఆయా రాష్ట్రాల భూభాగంలో ఉన్నాయన్నారు. సాగర్‌లో సీఆర్‌పీఎఫ్‌ బలగాలను వెనక్కి తీసుకోవాలని, గతనవంబరు 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని కేంద్ర జలశక్తి శాఖను కూడా కోరామని, కేంద్రం ఆదేశించినా పోలీసు బలగాలను వెనక్కితీసుకోవడం లేదన్నారు.

Advertisement
Advertisement