
కానీ వారానికి 48 పని గంటలు మించొద్దు
సులభతర వాణిజ్య విధానానికి సర్కారు నిర్ణయం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: సులభతర వాణిజ్య విధానం కోసం వాణి జ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై వాణిజ్య సంస్థల్లో (దుకాణాలు మినహా) పనిచేసే ఒక ఉద్యోగి రోజుకు పది గంటల వరకు విధులు నిర్వర్తించే అవకాశం కల్పించింది.
అయితే వారంలో 48 గంటలకు మించి పనిచేయకూడదనే నిబంధన విధించింది. రోజుకు 10 గంటల పనికి అవకాశం ఇచ్చినా, ఆరుగంటల తర్వాత అరగంట పాటు విశ్రాంతి ఇవ్వాలి. ఓవర్ టైమ్ పనిచేసే ఉద్యోగి ప్రత్యేక సందర్భాల్లో ఆరుగంటలకు మించి పనిచేయొద్దు. ఈ లెక్కన ప్రత్యేక సందర్భాల్లో ఒకరోజుకు గరిష్టంగా 12 గంటలు దాటి పనిచేసే అవకాశం లేదు.
వారంలో 48 గంటల కంటే అధిక గంటలు పనిచేసినప్పుడు.. అందుకు తగిన అదనపు భత్యం చెల్లిస్తూనే.. ఒక త్రైమాసికంలో 144 పనిగంటలు దాటకూడదు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అతిక్రమిస్తే సదరు వాణిజ్య సంస్థకు ప్రభుత్వం నుంచి అందుతున్న మినహాయింపులు, రాయితీలను ఎలాంటి నోటీసు లేకుండానే రద్దు చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు.