
ప్రజా పాలన రేషన్ కార్డుల దరఖాస్తుల విషయంలో రాని స్పష్టత
మరోవైపు మీ సేవ కేంద్రాల్లో కొత్తగా దరఖాస్తుల స్వీకరణ
సర్కిల్ ఆఫీసుల చుట్టూ దరఖాస్తుదారుల చక్కర్లు
వరంగల్‌కు చెందిన ఆంజనేయులు ఉపాధి కోసం రెండు దశాబ్దాల క్రితం నగరానికి వలస వచ్చి బోడుప్పల్‌లో స్థిర పడ్డారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాని ఆధారంగా జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డులేదని అధికారులు గుర్తించి క్షేత్ర స్థాయి విచారణ కూడా పూర్తి చేశారు. రేషన్ కార్డు కోసం ఎంపికై జాబితాలో సైతం పేరు చేర్చారు. అయితే ఇప్పటి వరకు రేషన్ కార్డు మంజూరు కాలేదు . ఇలాంటి ఉదంతాలు సిటీలో అనేకం. అయితే ప్రభుత్వం గత రెండు నెలలుగా మీ సేవ ఆన్‌లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ క్రమంలో ప్రజాపాలన దరఖాస్తులతో ఎంపికైన కుటుంబాలు కూడా మళ్లీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలా? వద్దా ? అనేది తెలియక వారు సందిగ్ధంలో పడ్డారు. దీనిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కోరుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంపికైన కుటుంబాలకు స్పష్టత లేకుండా పోయింది. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా సమగ్ర కుటుంబ సర్వేతో రేషన్ కార్డుల కోసం ఎంపికైనా ఇప్పటికీ మంజూరు అందని ద్రాక్షగా తయారైంది. మరో వైపు తాజాగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో ఇప్పటికే ఆఫ్‌లైన్ దరఖాస్తుల ద్వారా ఎంపికైన కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్ధకంగా తయారైంది. మళ్లీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే డబులింగ్ అయి అసలుకే ఎసరు వస్తుందన్న ప్రచారం కూడా కొనసాగుతోంది. సంబంధిత పౌరసరఫరాల అధికారులు కూడా స్పష్టత ఇవ్వక పోవడంతో పేద కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నారు.
సర్వేలో 83 వేల కుటుంబాలు
సరిగ్గా ఐదు నెలల క్రితం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డులు లేని సుమారు 83 వేల కుటుంబాలను గుర్తించారు. వాటిపై నిబంధనల ప్రకారం విచారణ నిర్వహించి 70 శాతం కుటుంబాలు అర్హులు అని తేల్చారు. పారదర్శకత కోసం వార్డు సభల్లో లబి్ధదారుల జాబితాను ప్రకటించిన తర్వాతనే కార్డులు మంజూరుకు సిఫార్సు చేయాలని జీహెచ్‌ఎంసీ భావించినప్పటికీ తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో వార్డు సభలు వాయిదా పడి ప్రక్రియ ముందుకు సాగలేదు. వాస్తవంగా గతేడాది జరిగిన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 5.73 లక్షల కుటుంబాల కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రభుత్వం కేవలం గ్యారంటీ పథకాల దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని, రేషన్ కార్డు దరఖాస్తులను పక్కకు పెట్టింది. సమగ్ర కుటుంబ సర్వేలో గుర్తించిన కుటుంబాలపై విచారణ జరపడంతో మిగతా కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. దీంతో వాటిపై కూడా విచారణ జరిపిస్తామని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌ద్వారా కొత్త దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో సర్వే జాబితాపై ఎలాంటి కదలిక లేకుండా పోయింది.
ఆన్‌లైన్ ద్వారా 2.60 లక్షల దరఖాస్తులు
కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా అన్‌లైన్‌లో ఇప్పటి వరకు సుమారు 2.60 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఎలాంటి క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభం కాలేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆదేశాలకు జారీ కాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. వాస్తవంగా సమగ్ర కుటుంబ సర్వేలో గుర్తించిన అర్హత గల కుటుంబాల జాబితా కూడా జీహెచ్‌ఎంసీ నుంచి పౌరసరఫరాల శాఖకు అందక పోవడం, మరోవైపు ఆన్‌లైన్ దరఖాస్తులపై కనీసం విచారణ ప్రారంభం కాకపోవడం వెరసి కొత్త రేషన్‌కార్డుల జారీపై సందిగ్ధత నెలకొంది.