మరో రూ.1,000 కోట్ల రుణం 

Telangana Govt Raises Rs 1000 Crore Loan From RBI - Sakshi

సెక్యూరిటీల వేలం ద్వారా సమకూర్చుకున్న ప్రభుత్వం 

మొత్తం రూ. 27,500 కోట్లకు చేరిన ఈ ఏడాది అప్పులు 

మరో రూ. 12 వేల కోట్ల రుణాల వినియోగంపై ఆర్థిక శాఖ తర్జనభర్జన 

సాక్షి, హైదరాబాద్‌:  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1,000 కోట్ల రుణం సమకూర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా తీసుకున్న ఈ అప్పును 21, 22 ఏళ్ల కాల వ్యవధిలో చెల్లించనుంది. మంగళవారం ఈ వేలం జరిగింది. రూ.1,000 కోట్లతో ఈ ఏడాది అప్పుల మొత్తం రూ.27,500 కోట్లకు చేరింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.47,500 కోట్లు రుణాల ద్వారా సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఏడాది మధ్యలో కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధన మేరకు ఆ రుణం రూ.39 వేల కోట్లకు తగ్గింది. ఇప్పటికి రూ.27వేల కోట్లకు పైగా రుణాలు సమకూరిన నేపథ్యంలో మిగిలిన సుమారు రూ.12 వేల కోట్ల రుణాలను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఆర్థిక శాఖ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి.  

డిసెంబర్‌లో మిగతా రుణాలు..! 
కాగ్‌ లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి తగ్గట్టుగానే ప్రతి నెలా ఖర్చులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తలపెట్టిన పలు కార్యక్రమాల అమలుకు అదనపు నిధులు అవసరమవుతున్నాయి. వచ్చే నెలలో ఇవ్వాల్సిన రైతుబంధుతో పాటు దళితబంధు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లాంటి కార్యక్రమాల కోసం మరిన్ని నిధులు అవసరం కానున్నాయి.

దీంతో ఈ ఏడాది డిసెంబర్‌లోనే తమకు మిగిలిన రుణాలు సమకూర్చుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆర్థిక శాఖ వర్గాలు ఆర్‌బీఐకి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ఆర్బీఐ అనుమతినిస్తే వచ్చే నెలలోనే ఆ మేరకు రుణాలు తీసుకునే యోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. తమపై కక్ష సాధింపులో భాగంగా ఇప్పటికే రుణాల్లో కోత విధించారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ఆర్థికశాఖ పెట్టిన ఈ ప్రతిపాదన ఏ మేరకు కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాల్సిందే.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top