
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిలను పేర్కొన్నారు.
బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. విషయ తీవ్రత, ప్రాధాన్యత దృష్ట్యా విధి లేకే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపింది. గవర్నర్ వద్ద 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని నివేదించింది. ఇప్పటికే పెండింగ్ బిల్లుల ఆమోదంపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటరి జనరల్ చర్చించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.
చదవండి: బండి సంజయ్ ఫోన్ ఎక్కడ? దానితోనే ఏ–2 ప్రశాంత్‌తో సంభాషణ!.. అసలు ఆ రోజు ఏం జరిగింది?