
రూ.20, రూ.50 ఎన్‌జేఎస్ పేపర్ల రద్దు యోచన
అన్నింటికీ రూ.100 స్టాంపు పేపరే వాడకం
కొన్ని వర్గాలకు, కొన్ని పనుల్లో ‘స్టాంపు’మినహాయింపు
బూట్ పద్ధతిలో చేపట్టే పనులపై 0.5 శాతం స్టాంపు డ్యూటీ
సరికొత్త విధానంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: సరికొత్త స్టాంపుల విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లలో రూ.20, రూ.50 విలువగల పేపర్లను రద్దుచేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. బహుళ ప్రయోజనకరంగా ఉపయోగించే నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల (ఎన్‌జేఎస్) విధానంతోపాటు అనేక అంశాల్లో మార్పులు చేస్తూ కొత్త స్టాంపుల విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు మొదలుపెట్టింది. కొత్త విధానంలో స్టాంపు డ్యూటీ విధింపు, మినహాయింపుల్లో కూడా మార్పులు రానున్నాయి. కొత్త పాలసీ ప్రభుత్వ పరిశీలనలో ఉందని, చర్చల అనంతరం దీనికి తుదిరూపు ఇస్తారని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల ద్వారా తెలిసింది.
లాభం లేదు.. భారమే అధికం
రాష్ట్రంలో ప్రస్తుతం రూ.20, రూ.50, రూ.100 స్టాంపు పేపర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసిన స్టాంపు వెండార్లతోపాటు రిజి్రస్టేషన్ల శాఖ వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతోంది. రూ.50 వేల విలువ వరకు జరిగే లావాదేవీలకు రూ.20.. రూ.లక్ష లోపు లావాదేవీలకు రూ.50.. రూ.లక్ష కంటే ఎక్కువ విలువ ఉండే లావాదేవీలకు రూ.200 చొప్పున (రూ.100 స్టాంపు పేపర్లు రెండు) స్టాంపు పేపర్లను ఉపయోగిస్తున్నారు. పలు రకాల అఫిడవిట్లు, డిక్లరేషన్లు, ఒప్పంద పత్రాలు, సేల్‌డీడ్‌లు, కంపెనీల మధ్య ఒప్పందాలు తదితర అనేక లావాదేవీల్లో వీటిని ఉపయోగిస్తుంటారు.
ప్రస్తుతం భౌతికమైన స్టాంపు పేపర్లతోపాటు ఆన్‌లైన్ ఫార్మాట్ (ఫ్రాంకింగ్)లో ఈ స్టాంపు పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి. వీటిని నాసిక్‌లోని ముద్రణాలయం నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, వీటి నిర్వహణ, సీలింగ్, పేపర్, రవాణా లాంటి ఖర్చులు కలిపితే రూ.20, రూ.50 స్టాంపులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వానికి వాటి విలువ కంటే ఎక్కువ ఖర్చవుతోందని, స్టాంపు వెండార్లకు ఇచ్చే 5 శాతం కమీషన్ కలిపితే వీటి అమ్మకాల వల్ల ప్రభుత్వంపై అధిక భారం పడుతోందని రిజి్రస్టేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో రూ.20, రూ.50 స్టాంపు పేపర్లను రద్దు చేయాలని, రూ.100 విలువైన పేపర్లను మాత్రమే అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా స్టాంపు పేపర్ల సరఫరా నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుని ఫ్రాంకింగ్ విధానంలో మాత్రమే ముందుకెళ్లేలా కొత్త పాలసీలో పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రతి లావాదేవీకి రూ.100 స్టాంపు పేపర్లు కొనుగోలు చేయడం విద్యార్థులు, రైతులు వంటి వర్గాలకు భారమవుతుందని భావించి.. ఆయా వర్గాలు ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న కార్యక్రమాల్లో ఇచ్చే అఫిడవిట్లు, డిక్లరేషన్లను మాత్రం ఉచితంగా ఇచ్చేలా పాలసీలో మార్పులు తేవాలనే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు.
కొందరికి మినహాయింపు: స్టాంపు డ్యూటీ విషయంలోనూ కొత్త పాలసీలో మార్పులు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. భూములు లేదా ఆస్తులను మహిళల పేరిట రిజి్రస్టేషన్ చేస్తే స్టాంపు డ్యూటీలో 1 శాతం మినహాయింపు ఇవ్వాలని యోచిస్తోంది. కాంట్రాక్టు పనులకు ప్రస్తుతం గరిష్టంగా రూ.200 స్టాంపు డ్యూటీ విధిస్తుండగా ఇకపై ‘బూట్’ పద్ధతిలో నిర్వహించే కాంట్రాక్టు పనులకు స్టాంపు డ్యూటీని విధించాలని, మొత్తం పని విలువలో 0.5 శాతాన్ని డ్యూటీ కింద వసూలు చేయాలని, ఈ మొత్తం గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఉండేలా కొత్త పాలసీలో ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్టు సమాచారం.