ఇదీ తెలంగాణ బ్రాండ్‌.. | Telangana Govt decided to showcase its beauty to world through Miss World | Sakshi
Sakshi News home page

ఇదీ తెలంగాణ బ్రాండ్‌..

May 4 2025 6:08 AM | Updated on May 6 2025 12:55 PM

Telangana Govt decided to showcase its beauty to world through Miss World

హైదరాబాద్‌లో విశ్వసుందరి పోటీలు జరిగే ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం

మిస్‌ వరల్డ్‌ పోటీల ద్వారా ప్రపంచానికి చాటాలని సర్కారు నిర్ణయం 

విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు ఉపకరిస్తుందనే భావన 

టూరిజం పాలసీకి విశ్వవ్యాప్త ప్రాచుర్యం కల్పించే యత్నం 

సురక్షిత ప్రాంతం, మౌలిక వసతుల నిలయం, ఘనమైన చారిత్రక వారసత్వం, ఆధునిక వైద్యం.. 

4 అంశాలపై విస్తృత ప్రచారం

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బ్రాండ్‌కు గుర్తింపు దక్కేలా మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ పెట్టుబడులు వీలైనంత ఎక్కువగా ఆకర్షించాలంటే తెలంగాణకు విశ్వవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు అవసరమని భావిస్తోంది. ఇందుకు ప్రపంచ సుందరి పోటీలు సరైన అవకాశమని భావిస్తోంది. వీటిని విజయవంతం చేయడం ద్వారా రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటాలనే పట్టుదలతో ఉంది. ఇటీవలే ప్రత్యేకంగా టూరిజం పాలసీని తీసుకొచ్చిన ప్రభుత్వం.. దాన్ని ఈ పోటీల నిర్వహణతో ముడిపెట్టి విశ్వవ్యాప్త ప్రచారం కల్పించనుంది. ‘తెలంగాణ.. జరూర్‌ ఆనా, తెలంగాణ.. హార్ట్‌ ఆఫ్‌ ది డెక్కన్‌’లాంటి నినాదాలను విస్తృతంగా వినియోగిస్తోంది. మిస్‌ వరల్డ్‌ పోటీల లోగోలో కూడా వీటిని పొందుపరిచింది.  

నాలుగు అంశాలు.. నలుదిక్కులా ప్రచారం 
ప్రపంచ సుందరి 72వ ఎడిషన్‌ పోటీలు ఈ నెల 10 నుంచి నెలాఖరు వరకు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో 120కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. ఈ పోటీలను కవర్‌ చేసేందుకు 150 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు హైదరాబాద్‌లో మకాం వేస్తున్నారు. పోటీలకు సంబంధించిన వివిధ ఘట్టాలు హైదరాబాద్‌లోని వివిధ వేదికల్లో జరుగుతున్నప్పటికీ, ఈ హడావుడి కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా యావత్‌ తెలంగాణను భాగస్వామ్యం చేసేలా.. పోటీ దారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేలా ఏర్పాట్లు చేసింది. 

నాగార్జునసాగర్‌ బుద్ధవనం, చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్, వరంగల్, రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట ఆలయం, పోచంపల్లి, మహబూబ్‌నగర్‌ పిల్లలమర్రి, పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్శన, శిల్పారామం.. తదితర ప్రాంతాలను సుందరీమణులు సందర్శించనున్నారు. ప్రతి టూర్‌కు అంతర్జాతీయ మీడియా ప్రచారం కల్పించనుంది. సురక్షిత ప్రాంతం, మౌలిక వసతుల నిలయం, ఘనమైన చారిత్రిక వారసత్వం, ఆధునిక వైద్యం..అంశాల ఆధారంగా తెలంగాణ బ్రాండ్‌ను ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

సురక్షిత ప్రాంతం
ప్రశాంత వాతావరణం ఉండే చోటుకే పెట్టుబడులు ఎక్కువగా వచ్చే వీలుంటుంది. ఈ అంశాన్ని ప్రధానంగా ఎస్టాబ్లిష్‌ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ సుందరి పోటీల్లో చిన్నపాటి అవాంఛనీయ ఘటనా జరగకూడదని పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌త పాటు మిస్‌ వరల్డ్‌ పోటీదారులు పర్యటించే అన్ని ప్రాంతాల్లోనూ పటిష్టమైన భద్రతా ఏరాట్లు చేస్తున్నారు. వారికి ప్రత్యేక కాన్వాయ్‌ ఏర్పాటుతో పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. సుమారు 1,200 మంది రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. 

మౌలిక వసతులు
పోటీలకు హాజరయ్యే వారికి నగరంలో అత్యంత అభివృద్ధి చెందిన, మౌలిక వసతుల పరంగా మెరుగ్గా ఉన్న హైటెక్‌ సిటీలోని స్టార్‌ హోటళ్లలో బస కల్పించారు. ప్రధాన పోటీలు జరిగే వేదికలను ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాలపై పోటీదారులు, మీడియా దృష్టి పడేలా చేయడం ద్వారా హైదరాబాద్‌లో మౌలిక వసతులపై ప్రపంచ వ్యాప్తంగా కొంత అవగాహన కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వివిధ దేశాలతో ఉన్న కనెక్టివిటీని వివరించడంతో పాటు పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, కొత్త సచివాలయ భవనం లాంటి వాటిని వారికి చూపించనున్నారు.  

మెడికల్‌ టూరిజం
అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ఆధునిక వైద్యవసతి హైదరాబాద్‌లో ఉందని అతిథులకు వివరించబోతున్నారు. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే 80 శాతం తక్కువ ఖర్చుకే ఆ స్థాయి ఆధునిక వైద్యాన్ని అందించే ఆసుపత్రులకు హైదరాబాద్‌ కేంద్రమని ప్రత్యేకంగా పోటీదారులు, విదేశీ మీడియాకు తెలియజేయనున్నారు. పోటీదారులను నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి ప్రత్యేకంగా తీసుకెళ్లి ఇక్కడి ఆధునిక వైద్య పద్ధతులు ప్రత్యక్షంగా తెలుసుకునే ఏర్పాటు చేశారు. ఏయే దేశాల నుంచి ఎంతమంది ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నదీ, వారికి ఇక్కడ అందుబాటులో ఉండే వసతులు, వైద్య సదుపాయాలను ప్రపంచం ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. 

ఘనమైన చరిత్ర, సంస్కృతి, ప్రపంచ రుచులు 
మెడికల్‌ టూరిజం తరహాలో ఇటీవల స్ట్రీట్‌ఫుడ్‌ టూరిజం కూడా విస్తృతమవుతోంది. స్ట్రీట్‌ ఫుడ్‌ను ఆస్వాదించే పర్యాటకుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఘనమైన వారసత్వం, చరిత్ర, సంస్కృతి ఉన్న నగరంలో విహరిస్తూ అక్కడి సంప్రదాయ భోజనం ఆస్వాదించటాన్ని ఈ పోటీల సందర్భంగా షోకేస్‌ చేసే దిశలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం విఖ్యాత చౌమొహల్లా ప్యాలెస్‌లో స్వాగత విందు (డిన్నర్‌) ఏర్పాటు చేశారు. 

ఇందులో 38 రకాల తెలంగాణ సంప్రదాయ వంటకాలను వడ్డించబోతున్నారు. కాంటినెంటల్‌ వెరైటీలకు సైతం హైదరాబాద్‌ వేదికే అన్న విషయం కూడా తెలిసేలా వివిధ ప్రాంతాల రుచులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ బాధ్యతను ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు అప్పగించారు. ఇక తాజ్‌ ఫలక్‌నుమా, చార్మినార్‌ ప్రాంతాలను చూపటం ద్వారా హైదరాబాద్‌ చారిత్రక నేపథ్యాన్ని కూడా కళ్లకు కట్టబోతున్నారు.  

పోటీలకు ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష 
మిస్‌ వరల్డ్‌ పోటీల కోసం జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీనియర్‌ పోలీస్, ఇతర అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాటిపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని చెప్పారు. అతిథుల బస విషయంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రత, బందోబస్తుకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. విమానాశ్రయం, హోటళ్ల వద్ద, అంతర్జాతీయ కార్యక్రమాల వేదికల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు. 

పర్యాటక శాఖ తరఫున పోటీదారులకు అందజేయడానికి వివరణాత్మక బుక్‌లెట్‌ను సిద్ధం చేయాలని సూచించారు. అతిథులు, పోటీల్లో పాల్గొనేవారు సందర్శించే అన్ని ప్రదేశాలను సుందరీకరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. డీజీపీ జితేందర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సీఎంఓ) జయేశ్‌ రంజన్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఐఅండ్‌పీఆర్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement