ప్రసూతి మరణాలపై విచారణ

Telangana Govt Appointed Inquiry Committee Over Maternal Mortality Deaths - Sakshi

త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సర్కారు 

వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: మలక్‌పేట ప్రాంతీయ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన ప్రసూతి మరణాలపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు, పేట్లబురుజు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాలతిలతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాలని  ప్రభుత్వం ఆదేశించింది.

అసలేం జరిగిందంటే ...
నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్లండ మండలం చెదుమ పల్లికి చెందిన సిరివెన్నెల (23), హైదరాబాద్‌ పూసలబస్తీకి చెందిన శివాని (24) మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వారం కిందట సిజేరియన్‌ చేయించుకున్నారు. అనంతరం వారి ఆరోగ్యం విషమించడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు 12వ తేదీన, మరొకరు 13వ తేదీన మరణించారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

వారి తీరును నిరసిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాలింతల మృతికి బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లే కారణమన్న వాదనలు వినిపించాయి. పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా ఇన్ఫెక్షనే కారణమని తేలినట్లు సమాచారం. ఇందుకు ఆసుపత్రిలో పరిశుభ్రత లోపమే ప్రధాన కారణమని గుర్తించారు. కాగా,  ఈ ఘటనలకు ముందు సిజేరియన్‌ చేయించుకున్న మరో 18 మందిని నిమ్స్‌ అత్యవసర విభాగానికి తరలించారు. అందులో ఇద్దరు బాలింతల కిడ్నీలకు ఇన్ఫెక్షన్‌ సోకడంతో వారికి డయాలసిస్‌ చేశారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని, అధికార వర్గాలు వెల్లడించాయి. కొందరిని డిశ్చార్జి కూడా చేశామని  చెబుతున్నారు. 

అధిక మోతాదు యాంటీబయోటిక్స్‌ వాడారా? 
బాలింతలకు అధిక మోతాదు యాంటీబయోటిక్స్‌ వాడటం వల్లే ఇన్ఫెక్షన్‌కు దారితీసిందని  వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించిన పరికరాలను స్టెరిలైజేషన్‌ చేయడంలో కొంత నిర్లక్ష్యం ఉన్నట్లు కూడా చెబుతున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వస్తున్నాయి.

గత ఆగస్టులో ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు మరణించిన తర్వాత కూడా ఇటువంటి సంఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.  ఇబ్రహీంపట్నం మరణాల తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆసుపత్రి ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయిందనడానికి మలక్‌పేట సంఘటన నిదర్శనంగా చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top