సాక్షి, మహబూబాబాద్: వైద్యం కోసం వచ్చిన రోగిని ఆధార్ కార్డు లేదనే నెపంతో ఆసుపత్రిలో చేర్చుకునేందుకు ఆసుపత్రి సిబ్బంది అంగీకరించలేదు. ఆసుపత్రి ఆవరణలో రోగి.. వైద్యం కోసం రెండు రోజుల పాటు పడిగాపులు కాస్తూ నిరీక్షించి నీరసించడంతో సిబ్బంది మృతి చెందాడనే అనుమానంతో మార్చురీలో భద్రపరిచిన అమానవీయ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
చిన్న గూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వి.రవి మూత్ర పిండాల వ్యాధితో ఇబ్బంది పడుతూ మూడు రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చాడు. రోగికి తోడుగా ఎవ్వరు ఉండక పోవడంతో పాటు ఆధార్ కార్డు లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించారు. దీంతో రోగి 2 రోజుల పాటు ఆస్పత్రి ఆవరణలో పడిగాపులు పడి.. నీరసించి ఆ చేతనంగా మారిపోయాడు. రోగి మృతి చెందాడనే అనుమానంతో వైద్య సిబ్బంది ఆసుపత్రిలోని మార్చూరికి తరలించి భద్ర పరిచారు.
మరుసటి రోజు మార్చురిని శుభ్ర పరచడానికి వచ్చిన స్వీపర్లు.... రోగి కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని రోగిని వైద్యం చేయిస్తున్నారు. ఆసుపత్రిలో ఇంత దారుణం జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు.. మానవత్వం మంటగలిపారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


