ఉద్యోగుల కేటాయింపుపై మార్గదర్శకాలు | Telangana: Government Has Issued Guidelines On The Allocation Of Employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల కేటాయింపుపై మార్గదర్శకాలు

Aug 11 2021 2:30 AM | Updated on Aug 11 2021 2:31 AM

Telangana: Government Has Issued Guidelines On The Allocation Of Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ క్యాడర్లకు ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు–2018 మేరకు పోస్టుల పునర్విభజన ప్రక్రియ ఇప్పటికే ప్రభుత్వం పూర్తిచేసింది. ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సంబంధిత క్యాడర్లకు కేటాయించాల్సి ఉంది. పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ వారీగా విభజించిన నిష్పత్తిలోనే ఆయా పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ పోస్టులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది.

మంజూరైన పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ పోస్టులుగా విభజించిన నిష్పత్తిలోనే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను సైతం జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ క్యాడర్లకు కేటాయించాలని సూచించింది. లోకల్‌ క్యాడర్లకు కేటాయింపు కోసం ఉద్యోగుల నుంచి ప్రాధాన్యతలను స్వీకరించాలని ఆదేశించింది.  అయితే, సీనియారిటీతో సంబంధం లేకుండా శారీరక వైకల్యం, వితంతువులు, కేన్సర్‌/కిడ్నీ రోగులు, మానసిక సమస్యలున్న పిల్లలు గల ఉద్యోగులు, జీవిత భాగస్వామి కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి/ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగి అయితే ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జీవిత భాగస్వామి ప్రాధాన్యత ప్రయోజనం జీహెచ్‌ఎంసీ పరిధిలో(హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధి)లో వర్తించదు.  

 కేటాయింపులు చేసేదెవరంటే.. 
జిల్లాస్థాయి ఉద్యోగుల కేటాయింపులను ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని కొత్త జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖ జిల్లా అధికారి సభ్యులుగా ఉండే కమిటీ జరపనుంది.  
జోనల్‌ పోస్టులకు ఉద్యోగుల కేటాయింపులను సంబంధిత విభాగం అధిపతి జరుపనున్నారు.  
మల్టీ జోనల్‌ పోస్టులకు ఉద్యోగుల కేటాయింపులను సంబంధిత శాఖ కార్యదర్శి చేస్తారు.  
ప్రక్రియకు గడువు  
వివిధ లోకల్‌ క్యాడర్లకు ఉన్న క్యాడర్‌ స్ట్రెంత్‌ను సంబంధిత హెచ్‌వోడీ/కార్యదర్శి 3 రోజుల్లో పూర్తిచేయాలి.  
క్యాడర్లవారీగా ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను కలెక్టర్లు/హెచ్‌వోడీలు/కార్యదర్శులు 2 రోజుల్లో పూర్తిచేయాలి. ఉద్యోగులు ఆప్షన్లను ఇచ్చేందుకు 3 రోజుల గడువు ఉంటుంది. జిల్లా కమిటీ/ హెచ్‌వోడీ/కార్యదర్శి ద్వారా ఉద్యోగుల కేటాయింపులను 10 రోజుల్లో పూర్తి చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement