విద్యుత్‌ పీఆర్సీ ఏడాది వాయిదా ! 

Telangana Electricity PRC Likely To Postponed For One Year - Sakshi

ఇప్పటికే సంకేతాలిచ్చిన విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు 

పీఆర్సీ భారాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే కొత్త టారిఫ్‌ ఉత్తర్వులు 

గడువు ముగిసినా ఏర్పాటుకాని కొత్త వేతన సవరణ సంఘం

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగులకు కొత్త వేతన సవరణ వాయిదా ఖాయమైంది. ఏప్రిల్‌ నుంచే కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా, నష్టాల నేపథ్యంలో ఏడాది వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు ఇప్పటికే సంకేతాలిచ్చాయి. వేతన సవరణ వ్యయభారాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే, రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సైతం 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్‌ ఉత్తర్వులను ప్రకటించడంతో.. పీఆర్సీ వాయిదాపై స్పష్టత వచ్చింది.

విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు రూ.5,596 కోట్ల మేర చార్జీలను పెంచడానికి ఇటీవల ఈఆర్సీ అనుమతించిన సంగతి తెలిసిందే. విద్యుత్‌ కొనుగోళ్ల వ్యయం, సరఫరా, పంపిణీ వ్యయం, ఇతర ఖర్చులతోపాటు సిబ్బంది ప్రస్తుత జీతభత్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని కొత్త చార్జీలను ఖరారు చేశారు.

కొత్త పీఆర్సీ అమలుతో పడే అదనపు భారాన్ని డిస్కంలు కూడా తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్‌)లో ప్రతిపాదించలేదు. మరోవైపు, ప్రస్తుత పీఆర్సీ గడువు గత నెలతో ముగిసినా.. విద్యుత్‌ సంస్థలు ఇప్పటివరకు కొత్త వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. ఉన్న వేతనాలు చెల్లించడానికి సతమతమవుతున్న పరిస్థితుల్లో పీఆర్సీ అమలు పట్ల యాజమాన్యాలు విముఖతతో ఉన్నాయి. 

8 ఏళ్లలో 147% పెరుగుదల 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లకోసారి వేతన సవరణ అమలు చేస్తుండగా.. విద్యుత్‌ ఉద్యోగులకు మాత్రం నాలుగేళ్లకోసారే అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే.. విద్యుత్‌ సిబ్బంది వేతనాలు ఎక్కువే. విద్యుత్‌ ఉద్యోగుల జీతాలు తమకన్నా ఎక్కువగా ఉన్నాయని పలువురు ఐఏఎస్‌ అధికారులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తుంటారు. గత రెండు పీఆర్సీలు, డీఏలను కలుపుకొంటే ఎనిమిదేళ్లలో ఏకంగా 147 శాతం వరకు విద్యుత్‌ ఉద్యోగుల జీతభత్యాలు పెరిగిపోయాయి. 

భారీ ఫిట్‌మెంట్‌తో భారం 
2018లో చివరి పీఆర్సీ కమిటీ 27 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేయగా, సీఎం కేసీఆర్‌ దానిని ఏకంగా 35 శాతానికి పెంచారు. తెలంగాణ వచ్చాక విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమించి 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడంలో ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడ్డారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఉత్తర/దక్షిణ తెలంగాణ డిస్కంలలో 25 వేల మంది ఉద్యోగులు, 22 వేల మంది ఆర్టిజన్లు, 25 వేల మంది పెన్షనర్లు ఉన్నారు.

జీతాలు, పెన్షన్లకు విద్యుత్‌ సంస్థలు ప్రతి నెలా రూ.600 కోట్ల చొప్పున ఏటా రూ.7,200 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ సమయంలో భారీ ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇవ్వడంతో విద్యుత్‌ సంస్థలపై ఆర్థిక భారం బాగా పెరిగింది. వ్యయంతో పోల్చితే ఆదాయం తగ్గి నష్టాలు పేరుకుపోతుండటంతో.. ప్రస్తుతం పీఆర్సీ అమలు సాధ్యం కాదని యాజమాన్యాలు భావిస్తున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top