పది జిల్లాల్లో 10శాతం లోపే

Telangana: Department Of Agriculture Report On Crop Cultivation - Sakshi

పంటలసాగుపై వ్యవసాయ శాఖ నివేదిక

ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 102 శాతం 

యాసంగిలో ఇప్పటివరకు 25 శాతానికి చేరిన సాగు 

సర్కారు ఆలోచనలకు అనుగుణంగా తగ్గిన వరి

సాక్షి, హైదరాబాద్‌: యాసంగి పంటలసాగు కొన్ని జిల్లాల్లో మందకొడిగా సాగుతోంది. పది జిల్లాల్లో పది శాతంలోపు విస్తీర్ణంలోనే సాగైంది. పెద్దపల్లి జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణంలో కేవలం రెండు శాతమే సాగైందని, ఇదే రాష్ట్రంలో అత్యల్పమని ప్రభుత్వానికి బుధవారం పంపిన నివేదికలో వ్యవసాయశాఖ వెల్లడించింది. రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, యాదాద్రి 3, మంచిర్యాల, మెదక్‌ 4, ములుగు 7, హన్మకొండ, జగిత్యాల 8, కరీంనగర్‌ 9, సూర్యాపేట జిల్లాలో 10 శాతం చొప్పున సాగయ్యాయి.

అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలో సాధారణంతో పోలిస్తే ఏకంగా 102 శాతం పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత నాగర్‌ కర్నూలు జిల్లాలో 81 శాతం సాగయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 46.49 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 11.65 లక్షల (25%) సాగైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.

నాలుగు శాతమే వరి నాట్లు... 
ఈ యాసంగిలో వరి తగ్గించాలన్న ప్రభుత్వ సూచనలను రైతులు పాటిస్తున్నట్లుగా తాజా లెక్కలు చెబుతున్నాయి. వరి సాధారణ సాగు విస్తీర్ణం 31.01 లక్షల ఎకరాలు కాగా, కేవలం 1.18 లక్షల (4 శాతం) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. మొక్కజొన్న 4.32 లక్షల ఎకరాలకుగాను ఇప్పటివరకు 1.83 లక్షల (42%) ఎకరాల్లో సాగైంది.

అన్ని రకాల పప్పుధాన్యాలు 3.45 లక్షల ఎకరాలకుగాను 4.01 లక్షల (116%) ఎకరాల్లో సాగయ్యాయి. అందులో మినుములు 24,018 ఎకరాలకుగాను, ఏకంగా 62,399 ఎకరాల్లో (260%) సాగైంది. వేరుశనగ 3.01 లక్షల ఎకరాలకుగాను 3.06 లక్షల (102%) ఎకరాల్లో సాగైంది. పొద్దుతిరుగుడు సాధారణ సాగు విస్తీర్ణం 10,947 ఎకరాలకుగాను 18,887 ఎకరాల్లో (173%) సాగైంది.

చిరుధాన్యాలపై అనాసక్తి
చిరుధాన్యాలపై దృష్టి సారించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా, రైతులు మాత్రం వాటి జోలికి పోవడంలేదు. యాసంగిలో సజ్జ పంట సాధారణ సాగు విస్తీర్ణం 22,967 ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 235 ఎకరాల్లోనే (ఒక్క శాతమే) సాగు కావడం గమనార్హం. జొన్న 75,274 ఎకరాలకుగాను 52,882 ఎకరాల్లో (70%) సాగైంది. రాగులు 689 ఎకరాలకుగాను 545 ఎకరాల్లో సాగైంది. కొర్రలు 148 ఎకరాలు కాగా, 204 ఎకరాల్లో సాగైంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top