పూర్తిస్థాయి భేటీలోనే చర్చిద్దాం..

Telangana Demands Full Fledged Krishna River Board Meeting - Sakshi

నీటి వివాదాలపై చర్చిద్దామని కృష్ణా బోర్డుకు ప్రభుత్వం లేఖ 

జూలై 20 తర్వాత ఏర్పాటు చేయాలన్న స్పెషల్‌ సీఎస్‌ 

నీటి వాటాల నిష్పత్తి మార్పు, ఏపీ ప్రాజెక్టులు సహా

ఆరు అంశాలపై చర్చించాలని వినతి 

చర్చకు కోరిన అంశాలు ఇలా.. 
ఇప్పటివరకు కృష్ణా జలాలకు సంబంధించి ఉన్న నీటి వాటాల నిష్పత్తిని ఈ ఏడాది నుంచి మార్చాలి. 
ఏపీ అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతలు, ఆర్డీఎస్‌ కుడి కాల్వ పనులను ఆపేలా చర్యలు తీసుకోవాలి 
పోతిరెడ్డిపాడు ద్వారా ఇతర బేసిన్, ఇతర ప్రాజెక్టులకు అదనంగా నీటి తరలింపుపై చర్యలు తీసుకోవాలి 
బచావత్‌ అవార్డు ప్రకారం.. పోలవరానికి కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చిన వెంటనే, కృష్ణా జలాల్లో 45 టీఎంసీల వాటాను తెలంగాణకు కేటాయించాలి. 
తాగునీటి అవసరాలకు వినియోగించే కృష్ణా నీటిలో 20 శాతం వినియోగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. 
బోర్డు ఇచ్చిన నీటి విడుదల ఆదేశాల్లో తెలంగాణ పొదుపు చేసిన జలాలను పక్కాగా లెక్కించాలి. 

సాక్షి, హైదరాబాద్‌ : కృష్ణా జలాలకు సంబంధించి నెలకొన్న వివిధ వివాదాల తీవ్రత దృష్ట్యా వాటిపై చర్చించేందుకు పూర్తిస్థాయి భేటీ నిర్వహించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. వివాదాస్పదమైన వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా, జూలై 20 తర్వాత తెలంగాణ, ఏపీలకు ఆమోదయోగ్యమైన తేదీల్లో సమావేశం నిర్వహించాలని కోరింది. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులను ఆరంభించే పనుల్లో తెలంగాణ సాంకేతిక బృందాలు తీరిక లేకుండా ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు ఇరిగేషన్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌కుమార్‌ సోమవారం బోర్డుకు లేఖ రాశారు.

మూడు రోజుల కిందట సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, త్రిసభ్య కమిటీ భేటీని కాకుండా పూర్తిస్థాయి సమావేశం జరపాలని ఆయన బోర్డును కోరారు. బోర్డుకు ఏపీ రాసిన లేఖలను ఆధారంగా చేసుకొని సభ్య కార్యదర్శి ఈ నెల 9న త్రిసభ్య కమిటీ భేటీ ఏర్పాటు చేశారని పేర్కొంటూ, ఈ మేరకు రాసిన లేఖలో సభ్య కార్యదర్శి కేవలం ఏపీ లేవనెత్తిన అంశాలనే ప్రస్తావించడంపై విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణ లేవనెత్తిన అంశాలనుఇందులో చేర్చలేదని తెలిపారు. బోర్డు పూర్తిస్థాయి భేటీలో చర్చించాల్సిన ఆరు అంశాలను రజత్‌కుమార్‌ తన లేఖలో పొందుపరిచారు.  

విద్యుత్‌ అవసరాలకే శ్రీశైలం 
ఇలావుండగా కృష్ణా జలాల ఆధారంగా చేపట్టిన శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా విద్యుత్‌ అవసరాల కోసం నిర్మించినదేనని రజత్‌కుమార్‌ మరోమారు పునరుద్ఘాటించారు. తెలంగాణ పూర్తిగా ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి ఉందని, ఖరీఫ్‌లో సాగుకు నీరందిం చాలంటే భారీగా విద్యుత్‌ అవసరాలున్నాయని తెలిపారు. ఈ దృష్ట్యానే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా సాగర్‌కు నీటిని తరలించి రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలను తీర్చుకుంటున్నామని వివరించారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top