ఒప్పందాలుంటేనే వరి.. యాసంగిలో వరి వేయొద్దని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సూచన

Telangana CS Somesh Kumar Suggests Farmers Not To Plant Rice In Yasangi - Sakshi

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి పారాబాయిల్డ్‌ (ఉప్పుడు) బియ్యం సేకరించబోమని భారత ఆహార సంస్థ నిర్ణయించినందున రాష్ట్ర రైతులు వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో యాసంగి సీజన్‌లో పండే వరి ఉప్పుడు బియ్యానికే అనుకూలమైందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డితో కలసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ యాసంగిలో వరి సాగు చేయవద్దని, ఒకవేళ విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందం లేదా సొంత అవసరాల కోసం అయితే సాగు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. జిల్లాల్లో వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. అవసరమైన చోట కొత్తగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.  

రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలకు ఇతర ప్రాంతాల ధాన్యం వస్తున్నట్లు గుర్తించామని, దీన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు నిరోధించాలని ఆదేశించారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యకార్యదర్శులు సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఎస్‌ఏఎం రిజ్వీ, పోలీస్‌ అధికారులు జితేందర్, అనిల్‌కుమార్, కార్యదర్శులు రఘునందన్‌రావు, క్రిస్టినా జెడ్‌. చొంగ్తు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్, రవాణా శాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు పాల్గొన్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top