Hyderabad: గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై సీఎస్‌ కీల​క వ్యాఖ్యలు

Telangana CS Somesh Kumar Comments on Ganesh Nimajjanam Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: నగరంలో సెప్టెంబర్, 2022లో జరిగే గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బీఆర్కేఆర్ భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కాలుష్య నియంత్రణా మండలి కార్యదర్శి నీతూ ప్రసాద్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు.
 
ఈ సందర్బంగా సీఎస్‌ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, నగరంలో కాలుష్య కారక గణేష్ విగ్రహాలను ఉపయోగించవద్దని  రాష్ట్ర హైకోర్ట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో మట్టి వినాయకుల విగ్రహాలు వినియోగించే విధంగా నగర వాసులను చైతన్య పర్చాలని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, సింథటిక్ కలర్లు, పర్యావరణ హాని కారక కెమికల్స్‌ను విగ్రహాల తయారీలో నిషేధిస్తూ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు.

 పీఓపీతో తయారు చేసిన విగ్రహాలను ట్యాంక్ బండ్‌తో పాటు నగరంలోని ఇతర చెరువుల్లో కూడా నిమజ్జనం చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందని సీఎస్‌ వివరించారు. ఈ అంశాలపై విగ్రహ తయారీదారులను చైతన్య పర్చాలని సూచించారు. నగరంలో మట్టి వినాయకుల తయారీ దార్లను ప్రోత్సహించడంతోపాటు మట్టి విగ్రహాల మార్కెటింగ్ కు తగు ప్రోత్సాహం ఇవ్వాలని సీఎస్‌ సూచించారు. హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

చదవండి: (ఉస్మానియా ఆస్పత్రి: వెయ్యి ఇస్తేనే శవం తీసుకెళ్తాం!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top