PM Kisan: లింకేజీ సమస్యలు.. రైతులకు అందని ‘పీఎం కిసాన్‌’! 

Telangana: Central Assistance To Farmers With Various Problems - Sakshi

పేర్ల నమోదు సహా వివిధ సమస్యలతో రైతులకు దక్కని కేంద్ర సాయం

తాజా పరిశీలనలో గుర్తించిన ఎన్జీవో లిబ్‌టెక్‌ ఇండియా

2018 డిసెంబర్‌ నుంచి 2021 జూన్‌ వరకు గణాంకాల విశ్లేషణ  

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌ పథకం) కింద పేర్లు నమోదు చేసుకోవడంలో ఎదురవుతున్న పలు సమస్యల కారణంగా రాష్ట్రంలో వేలాది మంది రైతులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందట్లేదని లిబ్‌టెక్‌ ఇండియా అనే ఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశీలనలో వెల్లడైంది. ప్రధానంగా ఆధార్, పాన్‌కార్డుల లింకేజీ సమస్యలు, బ్యాంకు ఖాతాల్లో పేర్లు సరిపోలకపోవడం, డేటాలో తప్పులు, ఆధార్‌ ప్రాతిపదికన తిరస్కరణ, లబ్ధిదారుల పేర్లకు ఆమోదం తెలపడంలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కొంత జాప్యం చోటుచేసుకోవడం, తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు ఈ సంస్థ తాజా నివేదిక తేల్చింది. అలాగే పేర్ల నమోదు వెబ్‌సైట్‌ ఆంగ్లంలో ఉండటం, రైతులందరికీ ఈ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లో సెల్ఫ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం తెలియకపోవడం వంటి సమస్యలు కూడా ఇందుకు కారణమని ఈ అధ్యయనంలో తేలింది. 

ఇదీ అధ్యయనం... 
లిబ్‌టెక్‌ ఆధ్వర్యంలో ఈ పథకానికి సంబంధించి ఆన్‌లైన్, పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, వివరాలతో సమగ్ర పరిశీలన నిర్వహించారు. తెలంగాణలోని 32 జిల్లాల్లో కిసాన్‌ సమ్మాన్‌ అమలు తీరును పరిశీలించారు. 2018 డిసెంబర్‌ నుంచి 2021 జూన్‌ (26వ తేదీ) వరకు కేంద్రం 8 కిస్తీలు (ఇన్‌స్టాల్‌మెంట్లు) చెల్లించగా అవి ఏ మేరకు లబ్ధిదారులకు చేరాయన్న అంశాన్ని బేరీజు వేశారు. 

ఇదీ పీఎం కిసాన్‌ పథకం... 
చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఏటా రూ. 6 వేలు (రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో) ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద లబ్ధి పొందేందుకు రిజిస్టర్‌ అయిన రైతులకు ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌–డీబీటీ) కింద నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం జమ అవుతుంది. ముందుగా రాష్ట్రాల స్థాయిలో ఈ పథకం కింద అర్హులైన రైతులను గుర్తిస్తారు. చెల్లుబాటయ్యే ఆధార్‌ కార్డులు, బ్యాంకు ఖాతాల పరిశీలన అనంతరం నేరుగా ఆ సొమ్మును వారి ఖాతాల్లో జమచేస్తారు. 

రాష్ట్రంలో అమలు తీరిలా... 
ఈ పథకం మొదలైన నాటి నుంచి 38,40,670 మంది రైతులు రిజిస్టర్‌ చేసుకోగా వారికి 2.83 కోట్ల ఇన్‌స్టాల్‌మెంట్ల ద్వారా రూ. 5,664 కోట్లు లబ్ధి చేకూరాలి. అయితే 37,73,259 మంది రైతులకు 2.65 కోట్ల ఇన్‌స్టాల్‌మెంట్ల ద్వారా రూ. 5,311 కోట్లు మాత్రమే అందాయి. 
34.12 లక్షల మంది రైతులకు (88.9 శాతం) అన్ని ఇన్‌స్టాల్‌మెంట్లు అందగా 3.6 లక్షల మందికి కనీసం ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌ మొత్తమైనా చేరింది. 
67,411 మంది రైతులకు ఒక్క ఇన్‌స్టాల్‌మెంట్‌ మొత్తం కూడా డిపాజిట్‌ కాలేదు. 
మేడ్చల్‌ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో 80 శాతానికిపైగా రైతులకు అన్ని ఇన్‌స్టాల్‌మెంట్లు అందాయి 
వాటిలో నాగర్‌కర్నూల్, నల్లగొండ, యాదాద్రి, నారాయణ్‌పేట జిల్లాలు వెనుకబడ్డాయి. 
260 గ్రామాల్లోని 100 శాతం రైతులకు అన్ని ఇన్‌స్టాల్‌మెంట్స్‌ అందాయి. 
339 గ్రామాల 75 శాతం రైతులకు ఈ ఇన్‌స్టాల్‌మెంట్స్‌ చేరాయి 
29 గ్రామాల్లోని 50 నుంచి 100 శాతం రైతులకు ఎలాంటి ఇన్‌స్టాల్‌మెంట్‌ అందలేదు. 
15 గ్రామాల్లోని 100 శాతం రైతులకు ఒక్క ఇన్‌స్టాల్‌మెంట్‌ జమకాలేదు 

కోర్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ సరిగా లేదు. డిజిటల్‌ సిస్టమ్‌లోనూ లోపాలున్నాయి. రైతులకు ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించే ఓపిక బ్యాంకు అధికారులకు ఉండట్లేదు. అన్ని డీబీటీ పథకాల్లోనూ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. రైతులకు అందుతున్న నగదు లబ్ధికి సంబంధించి సెంట్రల్‌ ఏజెన్సీ వద్ద బ్రాంచీలవారీగా వివరాలు ఉండేలా చర్యలు చేపట్టాలి. 
– డాక్టర్‌ డి. నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణుడు 

పీఎం కిసాన్‌ పథకం అమల్లో భాగస్వాములైన ఏజెన్సీలు, బ్యాంకులు, సంస్థల్లో జవాబుదారీతనం ఉండట్లేదు. రైతులు సెల్ఫ్‌ రిజిస్ట్రేషన్‌ లేదా మీ–సేవ కేంద్రాల్లో రిజిస్టర్‌ చేసుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. తెలంగాణలో పీఎం కిసాన్‌ కింద రైతుల రిజిస్ట్రేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని లబ్ధిదారుల సంఖ్యను 38 లక్షల నుంచి 63 లక్షలకు పెంచాలి. 
– చక్రధర్‌ బుద్ధా, డైరెక్టర్, లిబ్‌టెక్‌ ఇండియా 

పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించి రాష్ట్రంలో నోడల్‌ ఆఫీసర్‌ లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. కొందరు అర్హులకు ఆర్థిక సాయం అందట్లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఎక్కడ, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియట్లేదు. అందువల్ల కేంద్రం ఈ పథకం అమలుకు రాష్ట్ర స్థాయిలో ఒక అధికారిని నియమించాలి. 
– రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top