
శనివారం బీజేపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తున్న రాంచందర్‌రావు. చిత్రంలో కిషన్‌రెడ్డి, డీకే అరుణ, మురళీధర్ రావు తదితరులు
ప్రతి గ్యారంటీని అమలు చేసే వరకు అధర్మ ప్రభుత్వంపై పోరాడతాం
సామాజిక న్యాయమంటే మోదీని, బీజేపీని తిట్టడం కాదు
ఏడాదిన్నరలో ఏం చేశారో చెప్పకుండా చిల్లర
మాటలు చెప్పారు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
ఆరు గ్యారంటీలు అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధర్మ పాలన సాగుతోందని.. ఎన్నో హామీలతో మభ్యపెట్టి ఓట్లు దండుకున్న కాంగ్రెస్... ఇప్పుడు వాటిని అమలు చేయకుండా మోసగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. ప్రజలను వంచించిన అధర్మ ప్రభుత్వంపై ధర్మ యుద్ధాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్‌రావు శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలో అప్పుల కుప్పలు..
‘బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను సర్వనాశనం చేశాయి. పదేళ్లపాటు పాలించిన బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే రాష్ట్రం పరువును బజారుకీడ్చింది. అప్పులపాలైందంటూ ప్రపంచమంతటా ప్రచారం చేస్తోంది. హామీలు అమలు చేయాలని అడిగితే ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ప్రజలను మోసగిస్తోంది. ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసినప్పుడు హామీలు ఎందుకివ్వాలి? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు అన్నివిధాలా సాయం అందిస్తోంది. 11 ఏళ్లలో రూ. 12 లక్షల కోట్లు రాష్ట్రానికి ఇచి్చంది. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదంటూ దు్రష్పచారం చేస్తున్నారు. కేంద్రం ఏమి ఇచ్చిందో లెక్కలతో సహా వివరాలున్నాయి. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం’అని రాంచందర్‌రావు చెప్పారు.
యూరియా కొరత పట్టదా?
కాంగ్రెస్ పార్టీ ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సదస్సు అంటూ బహిరంగ సభ పెట్టి ప్రధాని మోదీ, బీజేపీని తిట్టడాన్ని రాంచందర్‌రావు తప్పుబట్టారు. సామాజిక న్యాయమంటే మోదీని, బీజీపీని తిట్టడం కాదన్నారు. ఏడాదిన్నరలో ఏం చేశారో చెప్పకుండా చిల్లర మాటలు మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని.. కేంద్రం దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపినా రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల, అధికార యంత్రాంగం చేతులెత్తేయడం వల్ల రైతులకు యూరియా అందడంలేదని విమర్శించారు.
ఏఐసీసీ అంటే ఆలిండియా చీటింగ్ కమిటీ
బీజేపీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని, కాంగ్రెస్ అధికారం కోసం, అవినీతి కోసం పనిచేసే పార్టీ అని రాంచందర్‌రావు ఆరోపించారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారని చెప్పారు. అధికారంలోకి వచి్చన రెండేళ్లలోపే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసిన ప్రజలు... ఈసారి బీజేపీకి అవాకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ధర్మ యుద్ధం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని ఆయన వ్యాఖ్యానించారు.
సీఎంకు బహిరంగ లేఖ..
ఎన్నికల హామీలను కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి శనివారం బహిరంగ లేఖ రాసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేయాలని.. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.