Telangana: గవర్నర్‌కు సాదర స్వాగతం

Telangana Assembly Budget Session: Governor Receives Warm Welcome From Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు వచ్చిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు శుక్రవారం సాదర స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉదయం 11.55 గంటలకు అసెంబ్లీకి చేరుకున్నారు. తర్వాత 12.05 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్‌ తమిళిసైకి సీఎం కేసీఆర్, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.

తర్వాత శాసనసభ హాల్‌ వరకు గవర్నర్‌ను సీఎం, స్పీకర్, చైర్మన్‌ స్వయంగా తోడ్కొని వచ్చారు. జాతీయ గీతాలాపన అనంతరం 12.12 గంటలకు ప్రారంభమైన గవర్నర్‌ ప్రసంగం.. 12.44 గంటల వరకు 32 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సమయంలో మంత్రులు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ప్రసంగం ముగిశాక గవర్నర్‌ సభ్యుల స్థానాల వద్దకు వచ్చి అభివాదం చేశారు. అనంతరం గవర్నర్‌కు శాసనసభ ప్రధాన ద్వారం వద్ద సీఎం, మండలి చైర్మన్, స్పీకర్‌ తదితరులు వీడ్కోలు పలికారు. 

యధాతథంగా.. 
ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య కొంతకాలంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అని ప్రజాకవి కాళోజీ కవితా పంక్తులతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్‌.. ‘కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసిపాపల నిదుర కనులతో ముసిరిన భవితవ్యం ఎంతో..’అని స్వాతంత్య్ర సమరయోధుడు, కవి దాశరథి కృష్ణమాచార్య పంక్తులతో ముగింపునకు వచ్చారు.

చివరిలో ‘జయ జయహే తెలంగాణ.. జై తెలంగాణ.. జై హింద్‌’ నినాదాలతో ముగించారు. ప్రసంగంలో వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరిస్తూ, ‘తెలంగాణ మోడల్‌’కు పెద్దపీట వేశారు. మొత్తంగా ప్రభుత్వం నుంచి అందిన ప్రసంగ పాఠాన్ని చదివి ఎక్కడా వివాదానికి తావులేకుండా ముగించారు.  

ఎక్కడా విమర్శలు లేకుండా.. 
గవర్నర్‌ ప్రసంగ పాఠంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శ లేకపోవడం గమనార్హం. గవర్నర్‌ ప్రసంగాన్ని రాజకీయ విమర్శలకు వేదికలా కాకుండా కేవలం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాలకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు కనిపించింది. ప్రసంగంలో అనేక మార్లు గవర్నర్‌ ‘మై గవర్నమెంట్‌ (నా ప్రభుత్వం)’అనే పదాన్ని వాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలు, పథకాల ఫలితాలను వివరించారు.

ఇటీవల ప్రభుత్వ పనితీరుపై రాజ్‌భవన్‌ వేదికగా విమర్శలు సంధించిన గవర్నర్‌ నోట ప్రభుత్వ పనితీరును సానుకూలంగా ఆవిష్కరించే రీతిలో ప్రసంగ పాఠం సాగడం గమనార్హం. సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే గవర్నర్‌ అసెంబ్లీలో అడుగు పెట్టారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top