గౌరవించాల్సిందే.. తమిళిసైగా కాదు.. గవర్నర్‌గా

Tamilisai Soundararajan Key Remarks On Telangana Government - Sakshi

నన్ను అవమానించినా పర్వాలేదు

గవర్నర్‌ ప్రొటోకాల్‌ నిబంధనలు సీఎస్, కలెక్టర్లకు తెలిసి ఉండాలి

మహిళా గవర్నర్‌తో ఆ విధంగా వ్యవహరిస్తారా?

తెలంగాణలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసు

ప్రధాని సహా ఏ ఒక్కరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు

వ్యవస్థకు అనుగుణంగా, న్యాయబద్ధంగా పనిచేస్తా

రాజ్యాంగపరమైన అధికారాలు కచ్చితంగా అమలు చేయాలనుకోవట్లేదు

సీఎం, మంత్రులతో ఏ విషయం అయినా చర్చించడానికి సిద్ధం

ప్రభుత్వంపై రిపోర్టు కార్డు తయారు చేయడం లేదు

ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యలు

మేమేం చేశామని మమ్మల్ని విస్మరిస్తున్నారు? అవమానిస్తున్నారు? నేనేం ఇగో ఉన్న వ్యక్తిని కాను. వివాదాస్పద వ్యక్తిని కాను. తెలంగాణ ప్రజల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు, సత్సంబంధాలు కొనసాగించేందుకు నేను మొదట్నుంచీ సిద్ధంగానే ఉన్నాను.

ఒకవేళ ఏ విషయాన్నైనా గవర్నర్‌ భిన్నాభిప్రాయంతో అంగీకరించకపోతే, గవర్నర్‌ ఆఫీస్‌ను అవమానపరుస్తారా? గవర్నర్‌ ప్రొటోకాల్‌ని ఉల్లంఘిస్తారా? తమిళిసైగా నన్ను అవమానించినా పర్వాలేదు. కానీ, గవర్నర్‌ కార్యాలయాన్ని, వ్యవస్థను మాత్రం గౌరవించాల్సిందే. – గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రస్తుతం ఏం జరుగుతోందో తాను ప్రత్యేకంగా ప్రధాని సహా ఎవరికీ తెలియజేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. తెలంగాణలో ఏం జరుగుతోందో మీడియా ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉందని వ్యాఖ్యానించారు. గవర్నర్‌గా తనకు ఉన్న అధికారాలు, అభిప్రాయాల మేరకు వ్యవస్థకు అనుగుణంగా, న్యాయబద్ధంగానే పనిచేస్తానని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం తన పనితీరుని తప్పుగా తీసుకొని గవర్నర్‌ను అవమానించాలని భావిస్తే పట్టించుకోనని స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అనంతరం తెలంగాణ భవన్‌లో గవర్నర్‌ మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. 

రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చకు సిద్ధం
రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశం గురించి అయినా చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ ముఖ్యమంత్రి వచ్చి ఏ విషయం గురించి అయినా చర్చిస్తా అంటే నేనేం ఆపట్లేదు, సమావేశం వద్దని అనట్లేదు కదా. సీఎం, మంత్రులు.. గవర్నర్‌ కార్యాలయానికి వస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నా. ఈ మధ్య ఏ విషయాలపైనా ఎలాంటి చర్చా జరగలేదు.

ఉగాదికి ఆహ్వానించినా రాలేదు
ఇటీవల జరిగిన ఉగాది ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వంలోని అందరినీ ఆహ్వానించినప్పటికీ ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. వ్యవస్థలోని తప్పును విశాల హృదయంతో ఎత్తి చూపినప్పుడు దానిని అంగీకరించడం కానీ, చర్చించడం కానీ చేయాలి తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. గవర్నర్‌ టూర్‌కి వెళ్ళినప్పుడు పట్టించుకోరా? కలెక్టర్, ఎస్పీలు రాకుండా ఏదైనా నిబంధన ఉందా? గవర్నర్‌ టూర్‌కి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రోటోకాల్స్‌ ఉండాలి, ఎలా గౌరవించాలన్న విషయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్లకు తెలిసి ఉండాలి. ఎంతో పారదర్శకంగా, ఫ్రెండ్లీగా ఉండే ఒక మహిళా గవర్నర్‌తో ఈ విధంగా వ్యవహరిస్తారా? 

తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి
ఎలాంటి కారణం లేకుండానే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం అనే విషయాన్ని, రాజ్యాంగపరమైన అధికారాలను నేను వినియోగించకపోవడాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పటివరకు నేను ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కోవిడ్‌–19 మహమ్మారి సమయంలో ప్రభుత్వానికి అనేక సలహాలు ఇచ్చా. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పనితీరు బాగుందని ఎలా మెచ్చుకోవాలి? గతంలో నివేదిక ఇచ్చేవారు. అందులో బాగున్న అంశాలను ప్రసంగంలో ప్రశంసించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కేవలం మీడియా రిపోర్టుల ఆధారంగా ఏ విధంగా ప్రభుత్వ పనితీరుని ప్రశంసిస్తా?

ప్రతిదీ వివాదాస్పదం చేయాలనుకోను
గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వం సేవా రంగానికి సంబంధించిన అభ్యర్థిత్వాన్ని పంపినప్పుడు, అది సరైన ప్రతిపాదన కాని పక్షంలో ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇదేమీ రాజకీయపరమైన నిర్ణయం కాదు. పూర్తిగా రాజ్యాంగపరమైన నిర్ణయం. శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ విషయంలోనూ రాజ్యాంగ నిబంధననే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా. ప్రభుత్వం పంపిన ప్రతి ప్రతిపాదన అంగీకరించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అయితే గతంలో ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాన్ని అంగీకరించా. ప్రతి విషయాన్నీ వివాదాస్పదం చేయాలని నేను కోరుకోను. 

సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నా..
గవర్నర్‌గా రాజ్యాంగపరమైన అధికారాలు ఉన్నప్పటికీ, ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకోవట్లేదు. అదే సమయంలో ప్రభుత్వం కూడా రాజ్యాంగాన్ని, గవర్నర్‌ కార్యాలయాన్ని గౌరవించాలి. ప్రభుత్వానికి కూడా గవర్నర్‌ కార్యాలయాన్ని గౌరవించాలన్న బాధ్యత ఉండాలి. ప్రోటోకాల్‌ నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం పట్టించుకోను. అయితే ఈ విధంగా నిబంధనల ఉల్లంఘన జరగడం సరైనదా కాదా అనేది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని మాత్రమే కోరుకుంటున్నా. అనేక విషయాల్లో చాలా సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. వివాదాస్పద వ్యక్తిగా ఉండాలనుకోవట్లేదు.

ప్రధాని దృష్టికి గిరిజనుల సమస్యలు
ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్ట్‌ కార్డును కూడా నేను తయారు చేయట్లేదు. మొదట్నుంచీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని మాత్రమే కోరుతున్నా. ఇటీవల వరంగల్‌ ఆసుపత్రిలో ఒక రోగిని ఎలుక కొరకడం ఎంతో బాధకలిగించింది. ఇటీవల తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో నేను చేసిన పర్యటన వివరాలను ప్రధాని మోదీకి తెలియజేశా. వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచాలని కోరా. 

నిర్మలా సీతారామన్‌తో భేటీ
ప్రధానితో సుమారు అరగంట సేపు భేటీ అయిన గవర్నర్, తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సమావేశమయ్యారు. తెలంగాణ, పుదుచ్చేరికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కాగా అంతకుముందు పార్లమెంటు లాబీలో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, కొందరు తమిళ ఎంపీలతో తమిళిసై ముచ్చటించారు.

చదవండి: తలొగ్గేది ప్రేమకే.. నేను అహంభావిని కాదు: ముందస్తు ఉగాది వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top