టేబుళ్లు.. కత్తెర్లు కరువు! రోగుల నిరీక్షణ!

Tables, scissors scarcity in NIMS Patient yet to wait for surgeries - Sakshi

నిమ్స్‌ న్యూరో సర్జరీ విభాగంలో  దారుణ పరిస్థితి

సర్జరీలకు నెలల తరబడి  నిరీక్షిస్తున్న రోగులు  

సాక్షి, సిటీబ్యూరో: సాధారణ చికిత్సలతో పోలిస్తే స్పైన్, స్పాండలైటిస్, మెదడులో కణుతుల చికిత్సలు కొంత క్లిష్టమైనవి. ఎంతో నైపుణ్యం, అనుభవం ఉన్న వైద్యులు మాత్రమే వీటిని చేయగలుగుతారు. నిమ్స్‌ న్యూరో సర్జరీ విభాగం ఈ చికిత్సలకు ప్రసిద్ధి. దీంతో ఇక్కడికి రోగులు పోటెత్తుతుంటారు. ఈ విభాగంలో మూడు యూనిట్లు ఉండగా, 60 పడకలతో పాటు మూడు ఆపరేషన్‌ థియేటర్లు ఉన్నాయి. రోజుకు సగటున ఆరు నుంచి ఏడు సర్జరీలు జరుగుతుంటాయి. రోగుల నిష్పత్తికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వైద్యపరికరాలు కొనుగోలు చేయకపోగా, ఏళ్ల క్రితం కొనుగోలు చేసినవి కూడా సాంకేతిక లోపాలు తలెత్తి మూలకు చేరాయి. ఏడాది క్రితం 35 లక్షల రూపాయల ఖరీదు చేసే అనస్థీషియా వర్క్‌ స్టేషన్, ఓటీ లైట్లు పాడైపోవడంతో అప్పటి నుంచి సర్జరీలకు విఘాతం కలుగుతోంది.

డ్రిల్లింగ్‌ మిషన్‌ లేక  సర్జరీలు వాయిదా.. 
ఎముకలను కత్తిరించే డ్రిల్లింగ్‌ మిషన్‌ (రూ.15 లక్షలు ఖరీదు చేసే) పాడైపోయి ఐదు నెలలైంది. ఇప్పటికీ దీన్ని కొనుగోలు చేయకపోవడంతో తీవ్రమైన నొప్పితో బాధ పడుతున్న వారికి మరింతకాలం నిరీక్షణ తప్పడం లేదు. ఇలా ఒక్క స్పైన్‌ అండ్‌ స్పాండలైటిస్‌తో బాధపడుతున్న బాధితులే 60 మందికిపైగా ఉన్నట్లు తెలిసింది. ఇక మెదడులో కణతులు, రక్తంగడ్డకట్టిన బాధితులు మరో వంద మందికి పైగా ఉన్నారు.   

కింది  చిత్రంలో కన్పిస్తున్న ఆయన పేరు కొప్పొజు శేఖరాచారి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం. ఫ్లోరైడ్‌ కారణంగా మెడ, వెన్నెముక వంగిపోయి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. లేచి నడవలేని స్థితిలో ఉన్న ఆయన చికిత్స కోసం ఇటీవల నిమ్స్‌ వైద్యులను సంప్రదించారు. న్యూరోసర్జరీ విభాగం వైద్యులు ఆయన్ను పరీక్షించి... సీసీఎం, సీ4, సీ5, సీ6 సర్జరీ చేయాల్సిందిగా సూచించారు. అత్యవసర విభాగంలో అడ్మిట్‌ రాసి, ఆ మేరకు సీరియల్‌ నెంబర్‌ కూడా ఇచ్చారు. నెలరోజులైంది కానీ ఇప్పటికీ సర్జరీ చేయలేదు. అదేమంటే ఆపరేషన్‌ టేబుల్‌ ఖాళీ లేదని ఒకసారి..బోన్‌ కటింగ్‌ కోసం ఉపయోగించే డ్రిల్లింగ్‌ మిషన్‌ లేదని మరోసారి తిప్పిపంపారు. సర్జరీ ఎప్పుడు చేస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు’..ఇలా ఒక్క శేఖరాచారి మాత్రమే కాదు మెదడులో కణుతులు, మెడ, వెన్నె ముఖ సమస్యలతో బాధపడుతున్న అనేక మంది చికిత్సల కోసం నాలుగైదు మాసాలు నిరీక్షించాల్సి వస్తోంది. చికిత్సలో జాప్యం వల్ల సమస్య మరింత ముదిరి చివరకు ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోంది.
  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top