నిజాం నవాబుల ఖడ్గం స్టైలే వేరు.. 117 ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చేసింది!

Sword Used By Nizam kings Came To India After 117 Years - Sakshi

హైదరాబాద్‌ సంస్థానాన్ని ఏలిన నిజాంలకు చెందిన అరుదైన, పాము ఆకార ఖడ్గం ఇది. ఇండో–పర్షియన్‌ డిజైన్, రంపపు పళ్ల తరహాలో రెండు వైపులా ఉన్న పదునైన మొనలు, బంగారు పూత పూసిన ఏనుగు, పులి బొమ్మలతో కూడిన ఈ ఖడ్గం 117 ఏళ్ల తర్వాత యూకే నుంచి తిరిగి భారత్‌కు చేరుకుంది. త్వరలోనే మన భాగ్యనగరానికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో దీని చరిత్ర, విదేశాలకు ఎలా తరలి వెళ్లింది..? ఇప్పుడు ఎలా స్వదేశం చేరుకుంటోంది వంటి వివరాలను తెలుసుకుందాం.

అధికార దర్పానికి చిహ్నంగా...
క్రీస్తు శకం 1,350లో తయారైన ఈ కరవాలాన్ని 1896 నుంచి 1911 మధ్య హైదరాబాద్‌ సంస్థానాన్ని పాలించిన ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ తన అధికార దర్పానికి, సైనిక శక్తిసామర్థ్యాలకు చిహ్నంగా పలు వేడుకల్లో ప్రదర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1903లో భారత్‌ను పాలించే బ్రిటిష్‌ చక్రవర్తిగా కింగ్‌ ఎడ్వర్డ్‌–7, క్వీన్‌ అలెగ్జాండ్రల పట్టాభిషేక మహోత్సవం ఢిల్లీ దర్బార్‌లో అట్టహాసంగా జరిగిందని, ఈ వేడుకలో పాల్గొన్న సందర్భంగా మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ ఈ ఖడ్గాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు.

చోరీయా లేక విక్రయమా..
మీర్‌ మహమూబ్‌ అలీఖాన్‌ పాలనలోనే ఈ ఖడ్గం మాయమైందని చరిత్రకారులు పేర్కొనగా ఈ ఖడ్గం సహా మరికొన్ని విలువైన వస్తువులను చోరీకి గురైన వస్తువులుగా ప్రభుత్వం పేర్కొంటూ వచ్చింది. బ్రిటిషర్ల వాదన మరోలా ఉంది. 1905లో నాటి బ్రిటిష్‌ సైన్యంలోని బాంబే కమాండ్‌కు చెందిన కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ సర్‌ హంటర్‌ దీన్ని హైదరాబాద్‌ సంస్థాన ప్రధాని బహదూర్‌ నుంచి కొనుగోలు చేశారని, 1978లో ఆయన మేనల్లుడు ఈ ఖడ్గాన్ని స్కాట్లాండ్‌లోని గ్లాస్గో లైఫ్‌ మ్యూజియంకు దానం చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఈ ఖడ్గం ఆరో నిజాం నుంచి నాటి ప్రధాని వద్దకు ఎలా వచ్చిందన్నది తెలియరాలేదు.

తిరిగి స్వదేశానికి.. 
భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా భారత్‌కు చెందిన 7 చారిత్రక వస్తువులను స్కాట్లాండ్‌ గత నెలలో తిరిగి అప్పగించింది. ఆ ఏడు వస్తువుల్లో నిజాం కాలంనాటి పాము ఆకార ఖడ్గం, 10వ శతాబ్దానికి చెందిన సూర్యదేవుని విగ్రహం మొదలైనవి ఉన్నాయి. పాము ఆకార ఖడ్గం నిజాంలకు చెందినది కాబట్టి కేంద్రం దాన్ని హైదరాబాద్‌కు పంపే అవకాశం ఉందని సాలార్‌జంగ్‌ మ్యూజియం డైరెక్టర్‌ నాగేందర్‌రెడ్డి తెలిపారు.    – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top